ఇంద్రాణి- పీటర్ ముఖర్జియా
సాక్షి, ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలోని ఫ్యామిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న ముఖర్జియా దంపతులు.. ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయాలను కూడా పిటిషన్‌లో పొందుపరిచారు.
బ్యాంకు అకౌంట్లతో సహా..
ఇప్పటివరకు సంయుక్తంగా లావాదేవీలు జరిపిన బ్యాంకు అకౌంట్లను ఇకపై వ్యక్తిగత అకౌంట్లుగా మార్పు చేసుకునేందుకు ఇరువురు అంగీకరించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఇద్దరి పేరిట సిండికేట్ బ్యాంకులో ఉన్న 53 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు, అంతర్జాతీయ బ్యాంకుల్లో కలిగి ఉన్న అకౌంట్లు, విదేశాల్లో ఉన్న బంగ్లాలు, విలువైన నగలు, ఖరీదైన వాచ్‌లు, బ్యాంకు లాకర్లను సమంగా పంచుకునేందుకు తామిద్దరికీ సమ్మతమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా 16 ఏళ్ల క్రితం ఇంద్రాణి, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే.
వైవాహిక జీవితంలో ఆటుపోట్ల వల్లనే..
దక్షిణ ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటర్‌లో ఇంద్రాణి, పీటర్‌ల ప్రేమ చిగురించింది. 2002లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్ కొడుకు రాహుల్‌తో.. ఇంద్రాణి కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించింది) షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.
షీనా బోరా హత్య కేసు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment