బీమా చేసిన మండపంలోని వినాయకుడు
ముంబై : వినాయక చవితి సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక వినాయక మండపానికి ఏకంగా 264.8 కోట్ల రూపాయల విలువైన బీమా చేశారట. కింగ్స్ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన ఈ మండపానికి అత్యంత ఖరీదైన మండపంగా పేరుంది. మండపంలో 14.5 అడుగుల ఎత్తైన వినాయకుడిని ప్రతిష్టించారు. ఏటా ఈ మండపానికి కోట్లలో బీమా చేస్తుంటారు. 2016లో రూ.300 కోట్లకి, 2017లో 264.3 కోట్లకి బీమా చేసిన ఉత్సవ కమిటీ ఈ సారి మరో 50 లక్షలు అధికంగా బీమా చేసింది. తమ వినాయకుడికి ఎంతో విలువైన ఆభరణాలు అలంకరిస్తామని, అలాగే, కమిటీ సభ్యులు, కార్యకర్తలకు కూడా వ్యక్తిగత బీమాలు చేస్తామని కమిటీ సభ్యుడు ఆర్‌జి భట్ చెప్పారు.
ఈ ఏడాది బీమాలో 19 కోట్లు బంగారం, వెండి, నగదుకు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, విద్యుత్ షాట్ సర్క్యూట్‌లు వంటి ప్రమాదాల నుంచి రక్షణకు కోటి రూపాయలు బీమా చేశామన్నారు. అలాగే, మండపానికి, ఎగ్జిబిషన్ ప్రాంగణానికి 20 కోట్ల బీమా ఉందన్నారు. తమ కమిటీకి సభ్యులు, కార్యకర్తలు కలిపి 2,244 మంది ఉన్నారని, వారందరికీ తలో 10 లక్షల రూపాయల చొప్పున వ్యక్తిగత ప్రమాద బీమా చేశామని భట్ వివరించారు. ఇలా అన్ని రకాల బీమాలు కలిపి 264 కోట్లు అయిందన్నారు.
ఆదాయం కోట్లలోనే..
జీఎస్‌బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన గణపతికి ఐదు రోజుల్లో వివిధ పూజలు తదితరాల రూపేణా అక్షరాల 8కోట్ల 15 లక్షల రూపాయలు వచ్చాయట. కమిటీ ప్రతినిధి సతీష్ నాయక్ స్వయంగా ఈ సంగతి చెప్పారు. గత ఏడాది 7.95 కోట్లు వచ్చాయి. ఈ మండపాన్ని కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంచుతారు. ‘ఈ ఐదు రోజుల్లో పూజల ద్వారా 6.1 కోట్లు, దేవుని హుండీ ద్వారా 69 లక్షలు వచ్చాయని, 350 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ప్రకటనల ద్వారా మరో కోటి రూపాయలు వస్తుందని భావిస్తున్నట్టు నాయక్ చెప్పారు. ఈ ఏడాది ఐదు రోజుల్లో దాదాపు ఎనిమిదన్నర లక్షల మంది భక్తులు వినాయకుడిని దర్శించుకున్నారని, 66,411 పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు. మండపంలో గణపతి హోమం, తులాభారం వంటి 42 రకాల పూజలు చేస్తామని ఆయన అన్నారు. కేరళ,కర్ణాటక, గోవాల నుంచి పూజారులను రప్పిస్తామని, ఒక్కో పూజారికి లక్ష రూపాయల వరకు ముడుతుందని భట్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment