అంతర్గత భద్రతకు తొలి ప్రాధాన్యం
* హోం మంత్రి రాజ్‌నాథ్ వెల్లడి
* బాధ్యతలు చేపట్టిన పలువురు మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు గురువారం బాధ్యతలు చేపట్టారు. తమ శాఖల పనితీరు మెరుగుపరుస్తామని, పారదర్శకతను పెంపొందిస్తామని ప్రతినబూనారు. కొందరు బ్లూప్రింట్లు వెలువరించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హోం శాఖ మంత్రిగా, కిరణ్‌రిజిజూ హోం శాఖ సహాయ మంత్రిగా విధులు స్వీకరించారు.
నితిన్ గడ్కారీ రోడ్లు, నౌకా రవాణా, జాతీయ రహదారులు, ప్రకాశ్ జవదేకర్ పర్యావరణం, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి, టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖల బాధ్యతలు చేపట్టారు. రాజ్‌నాథ్ తొలుత పార్లమెంట్ దగ్గర్లోని దేశ తొలి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు.
తర్వాత తన శాఖ సీనియర్ అధికారులతో సమావేశమై ఉగ్రవాదం, నక్సల్ నిరోధం వంటిఅంతర్గత భద్రతాంశాలపై చర్చించారు. అంతర్గత భద్రత తన తొలి ప్రాథమ్యమని, దీన్ని పెంచేందుకు, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయానికి ఆచరణాత్మక ఆలోచనలతో త్వరగా బ్లూప్రింట్ సిద్ధం చేయాలన్నారు. నక్సల్ నిరోధం, ఈశాన్య భారతం, జమ్మూ కాశ్మీర్ తదితర విభాగాలను ఈమేరకు ఆదేశించారు. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను జాతి ప్రయోజనాలతో రాజీపడకుండా పరిష్కరించుకోవడానికి ఆలోచనలు పంచుకోవాలన్నారు. మరోపక్క.. పర్యావరణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పారదర్శక వ్యవస్థను పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రారంభించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి గంగానదిని జలరవాణాకు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, ఇథనాల్‌తో నడిచే కార్ల వాడకాన్ని పెంపొందించడం, పెండింగ్‌లో ఉన్న 50 రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేయడం నా ప్రాధాన్యాలు. కాంక్రీట్ హైవేల నిర్మాణంపై దృష్టి సారిస్తాం. గంగానది ద్వారా గంగోత్రి-కాన్పూర్-అలహాబాద్-కోల్‌కతాల మధ్య, కాన్పూర్-పాట్నాల మధ్య సరుకు, ప్రయాణికుల రవాణా అవకాశాలపై జలవనరులు, పట్టణాభివృద్ధి తదితర శాఖలతో చర్చిస్తున్నాం.
- నితిన్ గడ్కారీ (రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ మంత్రి)
మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇస్తాం. పర్యావరణ అనుమతుల దరఖాస్తుల పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటిస్తాం. అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకూ ప్రాధాన్యమిస్తాం.
- ప్రకాశ్ జవదేకర్(పర్యావరణ మంత్రి)