గువహటి : పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యం భగ్గుమంటోంది. పలు ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో అసోంలో పెద్ద ఎత్తున హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ఘర్షణలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి 24 గంటల పాటు పది జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌లలో మతపరమైన వివక్షను ఎదుర్కొంటూ దేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లుకు సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసోం అంతటా విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో హింసాత్మకనిరసనలు చోటుచేసుకున్నాయి. అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తే స్ధానికుల అవకాశాలు దెబ్బతింటాయని బిల్లును వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అభ్యంతంర వ్యక్తం చేస్తున్నారు. కాగా నిరసనలను నియంత్రించేందుకు మొబైల్ డేటా, ఇంటర్‌నెట్ సేవలను 24 గంటల పాటు నిషేధిస్తున్నట్టు అసోం ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment