కేంద్రంపై రెఫరెండం కాదు: బీజేపీ
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై రెఫరెండం కాదని బీజేపీ స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో పార్టీ ఓటమిపై స్పందిస్తూ.. ఈ ఫలితాలు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది. ఈ ఎన్నికలపై స్థానికాంశాల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని వివరించింది. అయితే, స్థానికంగా ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి దీన్నో అవకాశంగా భావిస్తున్నామని బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు.
బీఎస్పీ పోటీ చేయకపోవడం వల్ల ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ ఒకే పార్టీకి పడ్డాయని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ విశ్లేషించారు. పశ్చిమబెంగాల్‌లో పార్టీ గెలుపు శుభసూచకమన్నారు. అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలుపు సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.