ఉగ్ర ఉచ్చులో హైదరాబాదీలు!
ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నట్లు పోలీసుల అనుమానాలు
* నాగ్‌పూర్‌లో శ్రీనగర్ విమానం ఎక్కుతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న
* ఏటీఎస్ రాష్ట్ర పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ఏటీఎస్
* పట్టుబడ్డ ముగ్గురూ గతంలో ఐఎస్‌లోకి వెళ్లేందుకు యత్నించిన వారే
సాక్షి, హైదరాబాద్:
ప్రపంచాన్ని ‘ఉగ్ర’ దాడులతో వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళుతున్నట్టుగా అనుమానిస్తున్న ముగ్గురు హైదరాబాదీలను మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో శ్రీనగర్ మీదుగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని ప్రణాళిక రచించుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాష్ట్ర పోలీసులు వెంటనే అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం(ఏటీఎస్) పోలీసులు నాగ్‌పూర్ విమానాశ్రయంలో శనివారం వీరిని అదుపులోకి తీసుకుని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు.
అంతా 24 గంటల్లోనే..: హైదరాబాద్ చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్‌కు చెందిన అబ్దుల్ బాసిత్, ఒమర్ ఫారుఖీ హుస్సేనీ, మహ్మద్ హుస్సేన్ రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 24 గంటల వ్యవధిలోనే వీరిని అదుపులోకి తీసుకోగలిగారు. గతంలోనే వీరు ఉగ్రవాదంవైపు మొగ్గుచూపడంతో అప్రమత్తమైన పోలీసులు వారి మొబైల్స్‌తో పాటు సోషల్ నెట్‌వర్కింగ్ ఖాతాలపైనా నిఘా ఉంచారు. పలు రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. అంతేకాక వారి పాస్‌పోర్టులతో పాటు సమగ్ర సమాచారాన్ని పేర్కొంటూ అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కుటుంబ సభ్యుల సహకారంతో వారు ప్రయాణిస్తున్న ప్రాంతాలను గుర్తించగలిగారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నాగ్‌పూర్ చేరుకున్న విషయాన్ని గుర్తించి వెంటనే మహారాష్ట్ర ఏటీఎస్‌ను అప్రమత్తం చేశారు. పక్కా నిఘా ఉంచిన ఏటీఎస్ పోలీసులు శ్రీనగర్ విమానం ఎక్కుతుండగా ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
గతంలో కౌన్సెలింగ్ పొందిన వారే..
ఫారుఖీ హుస్సేనీ, అబ్దుల్ బాసిత్, మహ్మద్ హుస్సేన్ ముగ్గురూ డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులే. ఈ ముగ్గురు గతంలోనూ ఐఎస్‌లో చేరేందుకు యత్నించిన వారే. ఐఎస్‌లో చేరేందుకు దుబాయ్ వెళుతున్న సల్మాన్ మొహినుద్దీన్‌ను ఈ ఏడాది జనవరి 17న శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో ఐఎస్‌కు ఆకర్షితులైన రాష్ట్రానికి చెందిన పలువురు యువకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు వారందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. వీరిలో ఫారుఖీ హుస్సేనీ, అబ్దుల్ బాసిత్, మహ్మద్ హుస్సేన్ కూడా ఉన్నారు. వీరిపై పోలీసులు నిరంతర నిఘా ఉంచినా.. కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యుల సహకారంతో వారిని పట్టుకోగలిగారు.
అంతా విద్యావంతులే..
ఐఎస్ వైపు మొగ్గుచూపుతున్న వారిలో ఇంజనీరింగ్, మెడిసిన్ అభ్యసించే విద్యార్థులతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం ఉన్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో వెలుగుచూశాయి. వీరందరినీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ముందుగా చాటింగ్‌లోకి దింపుతున్నారు. యువకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, తమకు నచ్చిన వారికి బాబ్రీ మసీదు విధ్వంసకాండ, ఇరాక్‌లో అమెరికా సైన్యాల అరాచకాల వంటి క్లిప్పింగ్‌లను పంపిస్తూ రెచ్చగొడతారు. ఇస్లాం రాజ్యాన్ని విస్తరించేందుకు జిహాద్(పవిత్ర యుద్ధం)లో పాల్గొనాలని ఐఎస్ ఇస్తున్న పిలుపు ఒకటైతే.. ఇరాక్, సిరియాల్లో తాము ఇస్లాం రాజ్యాన్ని స్థాపించామని ‘సాధించిన విజయాన్ని’ కూడా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఆకర్షితుడైన హుమాయున్‌నగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అబ్దుల్లా ‘నేను జిహాద్(పవిత్ర యుద్ధం) కోసం ఇరాక్‌లోని ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు. అదృష్టం ఉంటే స్వర్గంలో కలుసుకుంటా’ అని గత ఏడాది తన తండ్రికి లేఖ రాసి వెళ్లిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బెంగాల్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న అబ్దుల్లాను కొద్దినెలల క్రితం పట్టుకున్నారు. అతడితో పాటు కరీంనగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నోమాన్, చాంద్రాయణ్ గుట్టకు చెందిన ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు అద్నాన్ అహ్నన్, సనాత్ తహిసన్ కూడా ఉన్నారు. వీరిని హైదరాబాద్ పోలీసులు విచారించగా ఐఎస్‌లో చేరేందుకు మరో 42 మంది యువకులు మానసికంగా సిద్ధమయ్యారన్న విషయం వెల్లడించారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వీరిలో కొందరిని ముందుజాగ్రత్త చర్యగా మేజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. ఈ ఆరు నెలల కాలంలో ఐఎస్‌లో చేరాలనుకున్న వారి సంఖ్య 84కి పెరిగినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి ఉదంతాలు తరుచు వెలుగుచూస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.