నిందితుడు రంజాన్ రియాజ్
సాక్షి, సిటీబ్యూరో : ‘నా భార్య గుండెకు రంధ్రం పడి చనిపోయింది. నాకు ఒక కుమార్తె ఉంది. నా కుమార్తె కోసం మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నానని షాదీ.కామ్‌లో ప్రొఫైల్ ఆప్‌లోడ్ చేసిన నాగపూర్ వాసి రంజాన్ రియాజ్ అన్సారీ నచ్చినవారు లైక్ కొట్టాలంటూ కోరాడు. ఇది నమ్మి లైక్ కొట్టిన నగరవాసితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు సోమవారం రంజాన్‌ను అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నాగపూర్‌కు చెందిన రంజాన్ రియాజ్ అన్సారీ తన భార్య గుండె సమస్యతో చనిపోయిందని, తనకు ఒక కూతురు ఉందని, రెండో వివాహం చేసుకునేందుకు ఎవరైనా సిద్దంగా ఉంటే తన ప్రొఫైల్‌కు లైక్ కొట్టాలంటూ షాదీ.కామ్‌లో రెండేళ్ల క్రితం ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు.
దీనిని చూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ లైక్ కొట్టింది. తనకు ఇద్దరు పిల్లలున్నారని, తన భర్త కూడా లేడని రెండో వివాహనికి సిద్దమంటూ అంగీకారం తెలిపింది. దీంతో ఇద్దరు షాదీ.కామ్‌లోనే కొన్ని రోజుల పాటు చాటింగ్ చేసుకొని పరిచయం పెంచుకున్నారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్ చాటింగ్‌లు చేసుకున్నారు. ఫొటోలు షేర్ చేసుకున్నారు. తాను ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ట్రావెల్స్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు రంజాన్ ఆమెను నమ్మించాడు. దీంతో బాధితురాలు తమ కుటుంబసభ్యుల ఫోటోలను కూడా వాట్సాప్‌లో అతడికి షేర్ చేసింది. ఈ క్రమంలో అతని సెల్‌ఫోన్‌ను పరిశీలించిన రంజాన్ భార్య వారి మధ్య నడుస్తున్న వ్యవహారాన్ని పసిగట్టింది. దీంతో బాధితురాలికి ఫోన్ చేసి తాను రంజాన్ భార్యనని, అతడు అబద్దాలు చెబుతున్నాడని, నమ్మితే మోసపోతావనీ హెచ్చరించింది. దీంతో అమె రంజాన్ ఫోన్లకు స్పందించకుండా అతడిని దూరం ఉంచింది.
సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ ఫొటోలు...
దీంతో బాధితురాలిపై కోపం పెంచుకున్న రంజాన్ ఫేస్‌బుక్‌లో ఆమె పేరుతో నకిలీ ఐడీ సృష్టించాడు. గతంలో తనకు పంపిన ఫొటోలను మార్పింగ్ చేసి నగ్నంగా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో బాధితురాలు ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయడంతో సదరు ఫొటోలు, ఐడీని డిలీట్ చేశారు. దీంతో మరో ఐడీని క్రియేట్ చేసి వారి కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా మార్పింగ్ చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న బాధితురాలి సోదరి ఫొటోలను సైతం మార్ఫింగ్ చేసి ఆప్‌లోడ్ చేయడంతో పాటు వారి ఫోన్ నెంబర్లను కూడా కనబరిచాడు. దీంతో బాధితురాలు తమను వేధించవద్దంటూ రంజాన్‌ను వేడుకోగా, తనను పెళ్లి చేసుకోవాలని నాగపూర్‌కు వెళదామంటూ ఒత్తిడి చేస్తున్నాడు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్‌స్పెక్టర్ చాంద్‌పాషా నేతృత్వంలో ఎస్సై మహిపాల్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలో హైదరాబాద్ వచ్చిన రంజాన్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment