harrsment
-
‘‘చంపేస్తాం’’.. మహిళా జడ్జికి బెదిరింపు లేఖ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా జడ్జికి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆ మహాళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మహిళా జడ్జి గతంలో తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు తాజాగా బెదిరింపు లేఖ వచ్చిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు. లేఖ కవర్‌పై ఉన్న ఫ్రమ్ చిరునామా మొత్తం ఫేక్ అని, లేఖ వచ్చిన పోస్టాఫీసులో సీసీ టీవీ కెమెరా పరిశీలించాలని పోలీసులను జడ్జి కోరారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటే ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. జడ్జి గతంలో నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఇదీ చదవండి.. అతనికి 35, ఆమెకు 42 -
ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ భార్య ఫిర్యాదు
బనశంకరి: భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె సాదాసీదా మహిళ కాదు, ఓ ఐపీఎస్ అధికారిణి కావడం గమనార్హం. బాధితురాలు బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 2009 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 2011లో ఆమెకు భారతీయ విదేశాంగ సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారి నితిన్ సుభాష్‌తో వివాహమైంది. భర్త ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు. భర్త మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లకు లోనయ్యారని, వీటిని వదలిపెట్టాలని అనేకసార్లు మొరపెట్టుకోగా కోపంతో దాడి చేశాడని వర్తికా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో ఇదే విషయమై దౌర్జన్యం చేసి తన చేయి విరిచాడని తెలిపారు. దీపావళికి కానుక ఇవ్వలేదంటూ విడాకులు కావాలని బెదిరించాడని వర్తికా పేర్కొన్నారు. తన అమ్మమ్మ వద్ద రూ.5 లక్షలు, ఇంటి కొనుగోలుకని రూ. 35 లక్షల నగదు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్ సుభాష్, అతని కుటుంబసభ్యులు మొత్తం 7 మందిపై వరకట్న వేధింపులు, దాడులు, ప్రాణ బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కీచక ప్రిన్సిపాల్: రెండున్నరేళ్లుగా వేధింపులు
ప్రిన్సిపాల్... కళాశాలలో విద్యార్థుల నుంచి అధ్యాపకులకు, సిబ్బందికి దిశా,నిర్దేశం చేస్తూ క్రమశిక్షణతో, ఏకతాటిపై ముందుకు తీసుకువెళ్లాల్సిన వ్యక్తి. ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా మందలించి, అవసరమైతే చర్యలు తీసుకొని కళాశాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. మంచి ఉత్తీర్ణతా ఫలితాలతో వందలాది మంది విద్యార్థులను తన కళాశాల వైపు అడుగులు వేయించి ఇతర కళాశాలలకు ఆదర్శంగా నిలపాలి. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆయన ‘పచ్చ’ రంగు పులుముకొని...ఆ అండతో మహిళలపై వేధింపులకు దిగితే...అదే రాజమహేంద్రవంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో జరిగింది ... సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు సమీపాన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాలే కీచకుడుగా మారి మహిళా అధ్యాపకులపై గత రెండున్నరేళ్లుగా వేధింపులకు దిగుతున్న ఘటన ఇది. వందల మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 60 మంది పని చేస్తున్నారు. రెండువేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన విద్యాలయంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ నీచ చర్యలకు దిగడమేమిటని మహిళా సంఘాల ప్రతినిధులు విద్యావేత్తలు మండిపడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనేందుకు ఇదో ఉదాహరణ. ఎదురైన అవమానాలపై మహిళా అధ్యాపకులు రెండున్నరేళ్లుగా పోరాడినా న్యాయం దక్కకపోగా అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండదండలు ప్రిన్సిపాల్‌కు తోడవడంతో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారు. మొదట రాజమహేంద్రవరం పోలీసులకు, రెండోసారి ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు..ఇలా ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసినా న్యాయం దక్కకపోగా తిరిగి రివర్స్‌లో ఫిర్యాదు చేసిన 17 మందిపై వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం కుప్పకూలి వైఎస్సార్సీపీ సర్కారు రావడంతో బాధితుల్లో ఆత్మస్థైర్యం పెరిగి నేరుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత, విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌లకు బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి...రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు. 14 ఏళ్లుగా ఇక్కడ అధ్యాపకునిగా పనిచేస్తున్న ఈయన మధ్యలో రెండేళ్లు కొత్తపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెళ్లారు. ఆ తరువాత తిరిగి 2016లో ఇక్కడికే ప్రిన్సిపాల్‌గా వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ టీడీపీకి వీరాభిమానిగా సహాయ, సహకారాలు అందిస్తూ వచ్చాడు. దీంతో ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఇతని హవానే కొనసాగింది. తన కార్యకలాపాలకు అడ్డుపడే మహిళా అధ్యాపకులను తన ఆఫీసు రూమ్‌కి పిలిపించి ఏకవచనంతో, వెకిలి చేష్టలతో అవమానించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరగతి గదిలో, విద్యార్థుల ఎదుటే ఏకవచనంతో అవమానిస్తుండడంతో గత ఫిబ్రవరిలో జనరల్ ఫౌండేషన్ కోర్సుకు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేసే ఉదయశాంతి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలేజీలో పనిచేస్తున్న వారిలో సుమారు 40 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆమెకు అండగా నిలిచారు. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యేకు సానుభూతిపరుడిగా ఉండటంతో పోలీసులు ఆ కేసును నీరుగార్చేశారు. ఆ తరువాత గత మార్చి 3న అమరావతి వెళ్లి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ప్రిన్సిపాల్‌పై చర్యలు లేకపోగా, తిరిగి కాలేజీకి వచ్చాక ప్రిన్సిపాల్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని మహిళా అధ్యాపకులు కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తిపై చర్యలు లేకపోగా ఇంటర్‌బోర్డుకు పిలిపించి ప్రిన్సిపాల్‌కు జోన్–3, జోన్–4లకు ఇన్చార్జి హోదా ఇవ్వడం విశేషం. ఈ పరిణామంతో ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదనే అభిప్రాయానికి వచ్చిన మహిళా అధ్యాపకులు మరోసారి ఫిర్యాదు చేయడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు. కనీసం ఇంటర్‌బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి మహిళ అయి ఉండి కూడా సహచర మహిళా అధ్యాపకులకు భరోసా నివ్వకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో కొరవడిన ప్రశాంతత.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది మధ్య తరుచూ కీచులాట, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కమిషనర్‌కు ఫిర్యాదులతో కళాశాలలో ప్రశాంత వాతావరణం కొరవడిందనే చెప్పవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ వీర్రాజును ‘సాక్షి’ వివరణ కోరగా కాలేజీలో అటువంటి వాతావరణం ఏమీ లేదన్నారు. సక్రమంగా పనిచేయమన్నందుకే పనిగట్టుకుని కొందరు కేసులు పెడుతున్నారని చెప్పారు. -
‘లైక్’ తెచ్చిన తంటా
సాక్షి, సిటీబ్యూరో : ‘నా భార్య గుండెకు రంధ్రం పడి చనిపోయింది. నాకు ఒక కుమార్తె ఉంది. నా కుమార్తె కోసం మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నానని షాదీ.కామ్‌లో ప్రొఫైల్ ఆప్‌లోడ్ చేసిన నాగపూర్ వాసి రంజాన్ రియాజ్ అన్సారీ నచ్చినవారు లైక్ కొట్టాలంటూ కోరాడు. ఇది నమ్మి లైక్ కొట్టిన నగరవాసితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు సోమవారం రంజాన్‌ను అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నాగపూర్‌కు చెందిన రంజాన్ రియాజ్ అన్సారీ తన భార్య గుండె సమస్యతో చనిపోయిందని, తనకు ఒక కూతురు ఉందని, రెండో వివాహం చేసుకునేందుకు ఎవరైనా సిద్దంగా ఉంటే తన ప్రొఫైల్‌కు లైక్ కొట్టాలంటూ షాదీ.కామ్‌లో రెండేళ్ల క్రితం ప్రొఫైల్‌ను అప్లోడ్ చేశాడు. దీనిని చూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ లైక్ కొట్టింది. తనకు ఇద్దరు పిల్లలున్నారని, తన భర్త కూడా లేడని రెండో వివాహనికి సిద్దమంటూ అంగీకారం తెలిపింది. దీంతో ఇద్దరు షాదీ.కామ్‌లోనే కొన్ని రోజుల పాటు చాటింగ్ చేసుకొని పరిచయం పెంచుకున్నారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సాప్‌లు, ఫేస్బుక్ చాటింగ్‌లు చేసుకున్నారు. ఫొటోలు షేర్ చేసుకున్నారు. తాను ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ట్రావెల్స్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు రంజాన్ ఆమెను నమ్మించాడు. దీంతో బాధితురాలు తమ కుటుంబసభ్యుల ఫోటోలను కూడా వాట్సాప్‌లో అతడికి షేర్ చేసింది. ఈ క్రమంలో అతని సెల్‌ఫోన్‌ను పరిశీలించిన రంజాన్ భార్య వారి మధ్య నడుస్తున్న వ్యవహారాన్ని పసిగట్టింది. దీంతో బాధితురాలికి ఫోన్ చేసి తాను రంజాన్ భార్యనని, అతడు అబద్దాలు చెబుతున్నాడని, నమ్మితే మోసపోతావనీ హెచ్చరించింది. దీంతో అమె రంజాన్ ఫోన్లకు స్పందించకుండా అతడిని దూరం ఉంచింది. సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ ఫొటోలు... దీంతో బాధితురాలిపై కోపం పెంచుకున్న రంజాన్ ఫేస్బుక్లో ఆమె పేరుతో నకిలీ ఐడీ సృష్టించాడు. గతంలో తనకు పంపిన ఫొటోలను మార్పింగ్ చేసి నగ్నంగా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దీంతో బాధితురాలు ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయడంతో సదరు ఫొటోలు, ఐడీని డిలీట్ చేశారు. దీంతో మరో ఐడీని క్రియేట్ చేసి వారి కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా మార్పింగ్ చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న బాధితురాలి సోదరి ఫొటోలను సైతం మార్ఫింగ్ చేసి ఆప్‌లోడ్ చేయడంతో పాటు వారి ఫోన్ నెంబర్లను కూడా కనబరిచాడు. దీంతో బాధితురాలు తమను వేధించవద్దంటూ రంజాన్‌ను వేడుకోగా, తనను పెళ్లి చేసుకోవాలని నాగపూర్‌కు వెళదామంటూ ఒత్తిడి చేస్తున్నాడు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ చాంద్‌పాషా నేతృత్వంలో ఎస్సై మహిపాల్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలో హైదరాబాద్ వచ్చిన రంజాన్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. -
కోరిక తీరిస్తేనే కులధ్రువీకరణ
సాక్షి, రాయగడ: రాయగడకు 140కిలోమీటర్ల దూరంలో గల మారుమూల చంద్రపూర్ సమితి తహసీల్ విభాగానికి చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆగడాలు పెచ్చుమీరాయి. కులధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే బాలికలను శారీరక కోరిక తీర్చాలని వేధిస్తున్నాడంటూ అభియోగాలు వస్తున్నప్పటికీ తాను ఒడియా పత్రిక విలేకరిగా కూడా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అభియోగాలను కప్పిపుచ్చుకుంటున్నాడు. దీనిపై ఈ నెల 12 వతేదీన ఇద్దరు ఆదివాసీ బాలికలు చంద్రపుర్ సమితి బీడీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రపుర్ సమితిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుఖాంత్బెహరా వద్దకు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇద్దరు బాలికలు వెళ్లగా తన శారీరక కోరికను తీరిస్తే కుల ధ్రువీకరణ పత్రాలిస్తానని లేదంటే ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఆందోళన చెదిన వారు కలెక్టర్‌కు, బీడీఓకు, పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో ఓసారి సస్పెన్షన్ సుఖాంత్ బెహరా గతంలో ఆదివాసీ కులధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసేందుకు ఒకొక్కంటికి రూ.20వేలు లంచం తీసుకుకుని మంజురు చేసేవాడన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇతర సాధారణ సర్టిఫికెట్లకు రూ.1000 నుంచి లంచాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు మహిళలను వేధించిన విషయంలో అనేక ప్రాంతాల్లో అతనికి దేహశుద్ధి కూడా జరిగింది. గతంలో ఒకసారి ఈ ఘటనలపై విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్ఐ సుఖాంత్బెహరాపై విజిలెన్స్ విచారణ జరపాలని చంద్రపూర్ సమితి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రత్యూష పెదనాన్నను కోర్టులో హాజరుపరచండి
హైదరాబాద్ : సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూష కేసుకు సంబంధించిన నివేదికను పోలీసులు గురువారం హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటుందని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, పరారైన తండ్రి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో సరైన సమయంలో స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు, వైద్యం అందించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు ఈ సందర్భంగా అభినందించింది. అలాగే ప్రత్యూష ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడుంటుందో తెలుసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో ఉండేందుకు ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆమెతో మాట్లాడి నివేదిక సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. అలాగే ప్రత్యూష పెదనాన్నను శుక్రవారం కోర్టులో హాజరు పరచాలని కోర్టు సూచించింది. మరోవైపు ప్రత్యూష తండ్రి రమేష్ ను గతరాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే.