
గవర్నర్‌కు నోటీసు ఇవ్వడం పొరపాటే
అరుణాచల్ గవర్నర్‌కు నోటీసును వాపసు తీసుకున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించటంపై నమోదైన కేసుల్లో.. ఆ రాష్ట్ర గవర్నర్‌కు తాము నోటీసు జారీ చేయటం పొరపాటని సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. రాజ్యాంగంలోని 361వ అధికరణం ప్రకారం ప్రకారం కోర్టు విచారణల నుంచి గవర్నర్‌కు పూర్తి మినహాయింపు (ఇమ్యూనిటీ) ఉంటుందన్న విషయాన్ని.. దీనికి సంబంధించి గతంలో తానే ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. అరుణాచల్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాకు జనవరి 28వ తేదీన జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకుంది. ఈ ఉత్తర్వులు గవర్నర్ తన అభిప్రాయాలను కోర్టుకు సమర్పించకుండా నిరోధించబోవని జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలావుంటే.. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ అరుణాచల్ మాజీ సీఎం నబమ్ టుకి, కాంగ్రెస్ నేత బమాంగ్ ఫెలిక్స్‌లు కొత్తగా వేసిన పిటిషన్లపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి తాజా నోటీసులు జారీ చేసింది.
బీజేపీకి మద్దతిచ్చే ప్రశ్నే లేదు: కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు
మరోవైపు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. తాము బీజేపీకి మద్దతిచ్చే ప్రశ్నే లేదని.. ముఖ్యమంత్రిగా నబమ్‌టుకీని తొలగిస్తే, తిరిగి కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేశారు.
నేనెవరికీ ఏజెంటును కాను: గవర్నర్
ఈటానగర్: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ప్రధాన కార్యాలయంగా రాజ్‌భవన్‌ను ఉపయోగించుకుంటున్నానంటూ తనపై వచ్చిన ఆరోపణను గవర్నర్ జె.పి.రాజ్‌ఖోవా ఖండిస్తూ.. తాను రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తున్నానని పేర్కొన్నారు. గవర్నర్ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల గురించి సోమవారం ఇటానగర్‌లో మీడియాతో మాట్లాడిన రాజ్‌ఖోవా వద్ద ప్రస్తావించగా.. ‘‘నేను రాజకీయేతర వ్యక్తిని. రాజ్‌భవన్‌ను రాజకీయ పార్టీల కార్యాలయం లాగా ఎన్నడూ వినియోగించలేదు. ఏ రాజకీయ పార్టీలకూ నేను అనుకూలంగా లేను. నేను ఎవరికీ ఏజెంటును కాను’’ అని ఆయన బదులిచ్చారు.