
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో శాసనసభ ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. తాము 18 ఏళ్లు నిండినప్పటికీ 2018 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకోవడం వల్ల ఓటు హక్కు కోల్పోతున్నామని పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్.అభిలాష్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణం ఉండాలంటే రాష్ట్రపతి పాలనే శరణ్యమని పిటిషన్‌లో తెలిపారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ను చేర్చారు. న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అధికార పార్టీకి అనుకూలమని..
తెలంగాణ శాసనసభ ఎన్నికలు సాధారణ షెడ్యూలు ప్రకారం జరిగితే 20 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు పొంది వినియోగించుకునేవారని, కానీ కేంద్ర ఎన్నికల సంఘం అర్ధంతరంగా ఓటర్ల నమోదు షెడ్యూలును కుదించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా ముందస్తుగా సభ రద్దు చేస్తూ మంత్రిమండలి సిఫారసు చేయగలదా? ఏ అత్యవసర పరిస్థితి లేకున్నా సభ అభిప్రాయాన్ని తెలుసుకోకుం డానే ఇలా రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అధికార పార్టీకి సానుకూల సమయమని చెప్పి ఓటర్ల నమోదుకు 2018 జనవరి 1ని అర్హత తేదీగా ప్రకటించడం స్వేచ్ఛ గా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమవుతుం దా?ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి పాలనకు ఎందుకు సిఫారసు చేయదు?’ వంటి ప్రశ్నలను పిటిషన్‌లో లేవనెత్తారు.
‘రద్దు’పై న్యాయ సమీక్ష జరపాలి
తెలంగాణ ఎన్నికలు 4 రాష్ట్రాలతో పాటే వస్తాయని, తాను ఎన్నికల సంఘంతో మాట్లాడానని సీఎం ప్రకటన చేశారని పిటిషనర్లు ఆక్షేపించారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను ఏపీలో విలీనం చేయగా సం బంధిత ఓటరు జాబితాను ఇప్పటికీ సవరించలేదని వివరించారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబి తాలో చేర్చేలా ఆదేశాలివ్వాలని, కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేని రీతిలో అసాధారణంగా అసెంబ్లీని రద్దు చేయడంపై న్యాయ సమీక్ష జరపాలని.. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిం చేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు.