ఆ నోట్లు ఏటీఎంలో వచ్చేందుకు మూడు నెలలు ఆగాల్సిందే...
న్యూఢిల్లీః జనానికి చిల్లర పాట్లు తప్పించేందుకు ఆర్‌బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రూ 200 నోట్లు ఏటీఎంల్లో అందుబాటులో ఉంచేందుకు మరో మూడు నెలల సమయం పట్టనుంది. రూ 200 నోట్లను సర్ధుబాటు చేసేందుకు ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేయాల్సి ఉంది.కొన్ని బ్యాంకులు ఇప్పటికే రూ 200 నోట్ల జారీకి అనుగుణంగా మెషీన్లను సర్ధుబాటు చేయాల్సిందిగా ఏటీఎం కంపెనీలను కోరాయి. మరికొన్ని బ్యాంకులు ఈ కసరత్తుకు చర్యలు చేపడుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న క్రమంలో నూతన కరెన్సీ నోట్లకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎంలను వాటికి అనుగుణంగా మార్చిన విషయం విదితమే.
మరోవైపు రూ 200 నోట్ల సరఫరాను త్వరలో పెంచుతామని ఆర్‌బీఐ ప్రకటించినా ఎప్పటి నుంచి వీటి సరఫరా మెరుగవుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.ఇక రూ 200 నోటుకు అనుగుణంగా ఏటీఎంల్లో మార్పు చేర్పులు చేయాలని ఆర్‌బీఐ నుంచి తమకు ఇప్పటివరకూ ఆదేశాలు రాలేదని ఏటీఎం మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం రూ 200 నోటు జారీకి తగినట్టు ఏటీఎంల్లో మార్పులు చేయాలని తమను కోరాయని తెలిపాయి.
కొత్త నోటు జారీకి తగినట్టు దేశవ్యాప్తంగా ఉన్న 2.25 లక్షల ఏటీఎంల్లో మార్పులు చేస్తారా అనే దానిపైనా సమాచారం లేదు. ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు అందిన వెంటనే తాము ఏటీఎంల్లో రూ 200 నోటు జారీకి అనుగుణంగా మార్పులు చేస్తామని దేశవ్యాప్తంగా 60,000 ఏటీఎంలను నిర్వహిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఎండీ రవి బీ గోయల్ చెప్పారు. మొత్తం ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు.