ఆధునిక ఫీచర్లతో ఏటీఎమ్‌లను అప్‌గ్రేడ్ చేయండి
బ్యాంక్‌లకు ఆర్‌బీఐ ఆదేశాలు
ముంబై: అధునిక భద్రత ఫీచర్లతో ఏటీఎమ్‌లను వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా అప్‌గ్రేడ్ చేయాలని బ్యాంక్‌లకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. డెబిట్, క్రెడిట్ కార్డులను స్కిమ్మింగ్, క్లోనింగ్ చేయడాన్ని నిరోధించే రక్షణాత్మక ఫీచర్లతో ఏటీఎమ్‌లను బ్యాంక్‌లు అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. ఈఎంవీ(యూరోపే, మాస్టర్‌కార్డ్,విసా) చిప్, పిన్ లతో కూడిన కార్డులను పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) టెర్మినల్స్ సమర్థవంతగా యాక్సెస్ చేస్తున్నాయని పేర్కొంది. కార్డ్‌ల్లో ఈఎంవీ చిప్, పిన్ ఉన్నప్పటికీ ఏటీఎమ్‌లు ఇప్పటికీ మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఆధారంగానే కార్డ్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయని ఆర్‌బీఐ వివరించింది.
ఫలితంగా ఏటీఎమ్ కార్డ్ లావాదేవీలు స్కిమ్మింగ్, క్లోనింగ్, తదితర మోసాలకు గురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. అందుకని ఏటీఎమ్‌లు కూడా ఈఎంవీ చిప్, పిన్ కార్డ్‌లను యాక్సెస్ చేసేలా ఏటీఎమ్‌లను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏటీఎమ్‌లను కూడా ఈఎంవీ చిప్, పిన్‌కార్డ్స్‌లను యాక్సెస్ చేసేలా రూపొందించాలని పేర్కొంది.