
15 నిమిషాల్లో జీఎస్‌టీ..
షరతులు వర్తిస్తాయ్: రాహుల్
ముంబై: కేంద్రం తెస్తున్న వస్తు,సేవల పన్ను (జీఎస్‌టీ)కు మద్దతిచ్చి 15 నిమిషాల్లోనే ఆమోదం పొందేలా చేయగలమని.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే అందుకోసం తమ షరతులకు ఎన్డీఏ సర్కారు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఒకసారి సర్కారు సరేనంటే.. బిల్లు గట్టెక్కినట్లేనన్నారు. ముంబైలో మేనేజ్‌మెంట్ విద్యార్థులతో మాట్లాడుతూ.. జీఎస్‌టీని కాంగ్రెస్ తీసుకువస్తే.. ఏడేళ్లపాటు బీజేపీ దీన్ని అడ్డుకుందన్నారు. పన్నులపై పరిమితుల్లేని జీఎస్‌టీని ఒప్పుకోబోమన్నారు. కార్యకర్తల భేటీలో మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేశారు.
మోదీ సర్కారు చాలా వేగంగా ప్రజాదరణ కోల్పోతుందన్నారు. వ్యవసాయ, ఆర్థిక, ప్రభుత్వ నిర్వహణలో ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అంటే పార్లమెంటులో 40 సీట్లు కాదని.. దేశంలో 20 శాతం ఓటు బ్యాంకు తమకుందన్నారు.