లిబియాలోని తెలుగువారిని రక్షించాలి
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వైఎస్ జగన్ లేఖ
హైదరాబాద్: లిబియా దేశానికి ఉపాధి కోసం వెళ్లి అక్కడి అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తిచేశారు. లిబియాలో ఏర్పడిన సంక్షోభం అంతర్యుద్ధంగా మారుతున్నందున అక్కడకు ఇతర దేశాల నుంచి వెళ్లిన వారి జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వారిని సురక్షితంగా వెనక్కు తీసుకురావాలని కోరుతూ మంగళవారం ఆయన సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. లిబియాలో చిక్కుకుపోయిన వారిలో దాదాపు వేయి మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారేనని పేర్కొన్నారు. వీరు స్వదేశాలకు వచ్చే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల కోసం ఒక్క కర్నూలు జిల్లా నుంచే వందమంది లిబియాకు వె ళ్లారన్నారు. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి లిబియాకు ఉపాధికి వెళ్లిన వారంతా అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారని, ఆయా కుటుంబాలకు వారే పెద్దదిక్కని వివరించారు. తమ వారు లిబియాలో చిక్కుకుపోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయన్నారు.
భారతీయుల తరలింపు!
న్యూఢిల్లీ: లిబియాలో హింస ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో.. అక్కడి భారతీయులను క్షేమంగా స్వదేశానికి రప్పించేందుకు భారతప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 750 మంది నర్సులు సహా 4,500 మంది భారతీయులను రప్పించే విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. సుష్మా ఆదేశాల మేరకు అక్కడి భారతీయులను క్షేమంగా తీసుకువచ్చేందుకు లిబియా రాజధాని ట్రిపోలీలోని భారత దౌత్య కార్యాలయానికి మరింత మంది సిబ్బందిని పంపిస్తున్నారు.