ఇదో అస్థిర దశ అన్న జైట్లీ!
న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీలో ఇప్పటికే అమల్లో ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాల నిషేధం దేశంలోని మరో పదకొండు నగరాల్లో అమల్లోకి రానుంది. ఇందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కత్తా, పాట్నా, అలహాబాద్, లక్నో, వారణాసి, పూనే, కాన్పూర్, నాగ్ పూర్, జలంధర్, లూధియానా, అమృత్ సర్ నగరాల్లో డీజిల్ వాహనాల నిషేధం అమల్లోకి తెచ్చేందుకు ఎన్జీటీ నిర్ణయించింది. ఆయా నగరాల్లోని కాలుష్యం ఆధారంగా ఎన్జీటీ నిషేధాన్ని అమల్లోకి తేనుంది. ఈనేపథ్యంలో తమ నిర్ణయం మార్చుకోవాలంటూ ఢిల్లీ భారీ పరిశ్రల శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను అభ్యర్థించింది.
ఇప్పటికే వారం క్రితం పదేళ్ళు దాటిన డీజిల్ వాహనాలు కేరళ రాజధాని తిరువనంతపురం, పర్యాటక పట్టణం కోచీ సహా రాష్ట్రంలోని ఆరు నగరాల్లో రోడ్లపైకి రావడాన్ని నిషేధిస్తూ ఎన్జీటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలోని మరో 11 నగరాల్లో డీజిల్ వాహనాలు నిషేధించాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ తాజా నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా కార్ల తయారీ దార్లకు ఎన్జీటీ నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఆరు రోజుల టోక్యో పర్యటనకు వెళ్ళిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశంలో ఆటోకంపెనీలపై మార్కెట్ ప్రతికూలత ప్రభావం, ఆటో పరిశ్రమల్లో పెట్టుబడుల అస్థిరత్వం వంటి విషయాలపై సుజికి మోటార్ ఛైర్మన్ ఒసామును కలసి చర్చించారు. భారతదేశంలో ఆటోరంగం అభివృద్ధి మార్గంలో నడుస్తుందని, ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు అశాశ్వతమైనవేనని అన్నారు. పైగా సుజికి వంటి భారీ పరిశ్రమలపై ఇటువంటి ప్రభావాలు పడే అవకాశం ఉండదని జైట్లీ అభిప్రాయ పడ్డారు.
2015 డిసెంబర్ నుంచి ఢల్లీ పరిసరప్రాంతాల్లో డీజిల్ వాహనాల అమ్మకాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. కాలుష్య సాకారంగా మారుతున్న హస్తినలో డీజిల్ కార్లు వినియోగం నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ డీజిల్ వాహనాల అమ్మకాలను నిలిపివేశారు. అనంతరం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కూడ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు.
అయితే భారీ డీజిల్ కార్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహనాల అమ్మకాల నిషేధం వల్ల ఆటో పరిశ్రమ తీవ్ర నష్టాల బారిన పడటంతోపాటు, పెట్టుబడులను తీవ్రంగా కోల్పోవాల్సి వచ్చింది. అదే కారణంతో సుమారు పదకొండు వేల వాహనాల ఉత్పత్తికూడ నిలిచిపోయింది. అంతేకాక పరిశ్రమల్లో సుమారు ఆరువేలమంది వరకూ ఉద్యోగాలను కూడ కోల్పోయారు. డీజిల్ కార్ల నిషేధం దేశం మొత్తం అమల్లోకి తెస్తే సుమారు ఏభై వేల వరకూ ఉద్యోగాలను కోల్పోవాల్సివస్తుందని సియామ్ రిపోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఆటో పరిశ్రమల యజమానులు తిరిగి పెట్రోల్ వాహనాలు, చిన్న డీజిల్ ఇంజన్లను ప్రవేశ పెట్టే ప్రయత్నాలను చేస్తుంటే... నిషేధం పూర్తిగా ఏకపక్ష నిర్ణయం అని సుజికి ఇండియా ఛైర్మన్ సి భార్గవ అన్నారు. ఇటువంటి నిబంధనలు భారతదేశానికే తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ప్రపంచంలోనే అతి పెద్ద ఆటో సంస్థ టయోటా అభిప్రాయ పడింది. ఇకనైనా ఆటో పరిశ్రమల శాఖ విన్నపాలను స్వీకరించి ఎన్జీటీ నిర్ణయం మార్చుకుంటుందో, అనుకున్నట్లుగానే పదకొండు నగరాల్లో అమలు చేస్తుందో వేచి చూడాలి.