
2024 నుంచి జమిలి ఎన్నికలు
నీతి ఆయోగ్ సూచన
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 2024 నుంచి ఒకేసారి ఎన్నికలు జరపాలని నీతి ఆయోగ్ సూచించింది. పరిపాలనకు ఎన్నికల ప్రచారంతో ఇబ్బంది కలగకుండా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేసారి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా(2017–2020) ముసాయిదాలో పేర్కొంది. ‘దేశ ప్రయోజనాల కోసం 2024 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించాలి. ఈ ప్రతిపాదన అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును గరిష్టంగా ఒకసారి తగ్గించడం చేయడంగానీ, పొడిగించడం గానీ అవసరమవుతుంది.
ఈ సూచనను పరిశీలించడానికి ఎన్నికల సంఘం నోడల్ సంస్థగా ఉండాలి. రోడ్ మ్యాప్ కోసం రాజ్యంగ నిపుణులు, మేధావులు, ప్రభుత్వాధికారులు, పార్టీల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా ఒక నివేదికను ఖరారు చేయాలి. రాజ్యాంగ, చట్ట సవరణలు, జమిలి ఎన్నికలకు మారడానికి ఆచరణసాధ్యమైన విధానం వంటి వాటిని పరిశీలించి, వచ్చే ఏడాది మార్చినాటికి బ్లూ–ప్రింట్‌ను సిద్ధం చేయాలి’ అని సూచించింది. ‘నీతి’ మూడేళ్ల ముసాయిదా ప్రణాళికను గత నెల 23న నీతి ఆయోగ్ పాలకమండలి సభ్యులకు అందజేయడం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు చెబుతున్న నేపథ్యంలో ‘నీతి’ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వ సేవలు ఔట్‌సోర్సింగ్‌కు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సర్వీసుల్లో ఔట్ సోర్సింగ్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తద్వారా ‘ప్రైవేట్’ మేధస్సును పాలనకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడింది. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం పైనే ఆధారపడడాన్ని తగ్గించాల్సి ఉందని పేర్కొంది. బ్యూరోక్రసీలోనూ పోటీతత్వాన్ని నెలకొల్పాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా ముసాయిదాలో సూచించింది. 2018–19లో పాలనలో ఎక్కువ శాతం డిజిటలైజ్ చేయాలని చెప్పింది. సివిల్ సర్వీస్ అధికారులనూ ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని.. బాగా పనిచేసిన వారికి అవార్డులు ఇవ్వాలని, అలాగే పనిలో సత్తా చూపించని వారిని మందలించాల్సిన అవసరం ఉందని చెప్పింది. నీతి ఆయోగ్ ఈ నివేదికను ఏప్రిల్ 23నే సభ్యులకు పంపింది.
‘న్యాయ పనితీరు సూచీ’ కావాలి
న్యూఢిల్లీ: విచారణలో జాప్యం, పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం ‘న్యాయవ్యవస్థ పనితీరు సూచీ’(జ్యుడీషియన్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్)ని ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. కింది కోర్టుల్లో జాప్యం తగ్గించి, వాటి పనితీరును తెలుసుకోవడానికి ఈ సూచీ హైకోర్టులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లకు దోహదపడుతుందని పేర్కొంది. ‘దీని కోసం వివిధ కేసుల పరిష్కారానికి వివిధ కాలపరిమితులు కావాలి. వార్షిక పనితీరు మదింపు వల్ల తాము ఎక్కడ విఫలమయ్యామో, సమస్య పరిష్కారానికి ఏం చేయాలో హైకోర్టు, జిల్లాల కోర్టుల జడ్జీలకు తెలుస్తుంది’ అని తెలిపింది. అవినీతి కేసులు పేరుకుపోయాయని, వాటిని కోర్టులు నిర్దిష్ట కాలవ్యవధితో పరిష్కరించాలని సూచించింది.