
'అమ్మ' ఆర్కే నగర్ నుంచే..
తమిళనాడు ముఖ్యమంత్రి, ఎఐడీఎంకే అధినేత్రి జయలలిత పోటీ వేదిక ఖరారైంది. అందరూ ఊహించినట్టుగానే ఆమె ఆర్కెనగర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీచేయనున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీవేదిక ఖరారైంది. అందరూ ఊహించినట్టుగానే ఆమె ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీచేయనున్నారు. జూన్ 27న పోలింగ్ జరగనుంది. పురుచ్చిత్తలైవి కోసం.. ఆమె మళ్లీ ఎన్నికయ్యేందుకు వీలుగా ఆర్కేనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పి. వేట్రివేల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జయలలితపై అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసిన తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఆమె శాసన సభ లేదా శాసన మండలికి ఎన్నిక కావడం తప్పనిసరి. అన్నాడీఎంకే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం జయలలిత ప్రకటించారు.
జయలలితపై పోటీకి దిగడం లేదని డీఎంకే ఇప్పటికే స్పష్టం చేసింది. ఆమె పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని డీఎంకే అధినాయకుడు కరుణానిధి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖుష్బూ పోటీ చేయొచ్చని సమాచారం. పీఎంకే మాత్రం తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో ఉంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
కాగా గతంలో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె ముఖ్యమంత్రి పదవినీ, శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే అమ్మను నిర్దోషిగా నిర్ధారిస్తూ మే 11న కర్ణాటక హై కోర్టు తీర్పు చెప్పడంతో మళ్లీ జయలలిత సీఎం పీఠాన్ని అధిరోహించారు.