లక్నో : ‘అమర్ సింగ్‌ను నా గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నాను. కానీ జనాలు మాత్రం మా ఇద్దరి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరైన జయప్రద, రచయిత రామ్ కమల్‌తో మాట్లాడుతూ.. ‘సినీ రంగం నుంచి వచ్చాను.. ఎంపీగా గెలిచాను. కానీ సాధరణ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను. ఈ రోజు నేను రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించగల్గుతున్నానంటే అందుకు కారణం అమర్ సింగ్. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఒకవేళ నేను ఆయనకు రాఖీ కట్టినా జనాలు తప్పుడు ప్రచారం మాత్రం ఆపరు. అందుకే వాటి గురించి పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపారు.
జయప్రద తొలుత సమాజ్‌వాదీ పార్టీలోనే ఉండేవారు. కానీ విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకు వచ్చి ఆమర్ సింగ్‌తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఎస్పీ నాయకుడు, రామ్‌పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన మీద యాసిడ్ పోస్తానంటూ అజామ్ ఖాన్ తనను బెదిరించారని తెలిపారు. కానీ ఈ బెదిరంపులకు తాను భయపడలేదన్నారు. ఈ విషయం గురించి చెప్తూ ‘నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇంటి నుంచి బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదని విచారం వ్యక్తం చేశారు.
అంతేకాక తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోజున తాను చనిపోవాలని నిర్ణయించకున్నట్లు జయప్రద తెలిపారు. ఆ సమయంలో అమర్‌సింగ్ డయాలసిస్ చికిత్సలో ఉన్నారని, ఏం చేయాలో పాలుపోక తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో ఎవరూ తనకు అండగా నిలవలేదన్నారు. డయాలసిస్ చేయించుకుని తిరిగి వచ్చిన అమర్‌సింగ్ మాత్రమే తనకు చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నానని.. అందుకే పనికిమాలిన పుకార్లను పట్టించుకోవడం మానేసానని తెలిపారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాజకీయాలనే కాదు ఏ రంగంలోనైనా రాణించడం మహిళలకు నిజంగా ఓ యుద్ధంతో సమానమని ఆమె వర్ణించారు. అంతేకాక ఇటీవలే విడుదలైన మణికర్ణిక సినిమాలో కంగనా పాత్రలో తనను తాను చూసుకున్నానని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రతి మహిళ ఓ దుర్గాదేవిగా మారాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment