
తిండి కోసం ఎగబడే వీధి కుక్కల లాంటి వారు
సాక్షి, బెంగళూరు : సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోస్తామని వ్యాఖ్యలు చేసే నాయకులు.. తిండి కోసం ఎగబడే వీధి కుక్కల లాంటి వారని కర్ణాటక మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే డీసీ థామన్న బీజేపీ నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని 24 గంటల్లో పడగొడతామంటూ బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్ కట్టి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన థామన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ.... గతంలో ఒకానొక సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జే హెచ్ పటేల్ అసెంబ్లీలో చెప్పిన ఏనుగు- కుక్క కథ చెప్పుకొచ్చారు.
‘ ఏనుగు దారి వెంట నడుచుకుంటే వెళ్తుంటే వీధి కుక్కలు వెంటపడతాయి. ఆ ఏనుగు నోటి నుంచి ఏదైనా ఆహార పదార్థం కింద పడుతుందా అని వేచి చూస్తాయి. అయితే అలాంటిదేమీ జరగదు. ఆహారం కింద పడనే పడదు. అలాగే కుక్కలు తినేందుకు అసలేమీ దొరకదు. ఈ కథ ఇప్పటి బీజేపీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. వాళ్లు ఊహించినట్టుగా మా ప్రభుత్వం ఎన్నటికీ పడిపోదు’ అని థామన్న వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నామని, కానీ ఎప్పటికీ నిజం కావని పేర్కొన్నారు.
కాగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, ఏ క్షణమైనా జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఉమేశ్ కట్టి వ్యాఖ్యానించగా... ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని, ప్రతిపక్షంలో కొనసాగుతామని స్పష్టం చేశారు.