జిగీష హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష | Jigisha Ghosh Murder Case: 2 Sentenced To Death, One Gets Life Term | Sakshi
Sakshi News home page

జిగీష హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష

Published Tue, Aug 23 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

జిగీష హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష

జిగీష హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష

మరొకరి జీవిత ఖైదు
శిక్షలు ఖరారు చేసిన ఢిల్లీ కోర్టు
దోషులకు 9.8 లక్షల జరిమానా
సౌమ్య హత్య కేసులోనూ
వీరే దోషులు

న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగిని జిగీష ఘోష్ (28) హత్య కేసులో ఢిల్లీ కోర్టు ఇద్దరికి మరణ శిక్ష , ఒకరికి జీవిత ఖైదును విధించింది. 2009 మార్చి18న దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న తన నివాసం వద్ద నుంచి ఆమెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు.

తెల్లవారుజామున 4 గంటలకు ఆఫీస్ క్యాబ్ ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్లగా అంతలో కొందరు ఆమెను కిడ్నాప్ చేశారు. 3 రోజులకు సూరజ్‌కుండ్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఈ కేసులో 2009 జూన్‌లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం రవి క పూర్, బల్‌జీత్, అమిత్ శుక్లాలను దోషులుగా నిర్ధారించింది.  రవి క పూర్, అమిత్‌శుక్లాలకు మరణశిక్ష, బల్జీత్‌కు జీవిత ఖైదు శిక్షలను ఖరారు చేసింది.
 
రూ.9.8 లక్షల జరిమానా..
ముగ్గురికి రూ. 9.8 లక్షల జరిమానా విధించింది. ఇందులో రూ. 6 లక్షలను బాధిత కుటుంబానికి అందజేయాలని సూచించింది. జిగీష నుంచి బంగారు గొలుసు, 2 ఫోన్లు, 2 ఉంగరాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు దొంగిలించి తర్వాత దారుణంగా హత్య చేశారు. ఆమె డెబిట్ కార్డుతో నిందితులు షాపింగ్ చేశారని సీసీటీవీ ఫుటేజీలో ఆ దృశ్యాలు లభించినట్లు బాధితురాలి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారు. వారు ఇప్పటికే ఏడేళ్లు జైలు జీవితం గడిపారని, వారిపై కనికరం చూపాలని కోర్టును నిందితుల తరఫు న్యాయవాది కోరారు.

దీనిపై స్పందించిన అదనపు సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్.. హత్య జరిగే సమయంలో జిగీష తనను చంపవద్దని దోషులను ప్రాధేయపడినట్లు.. కావాలంటే తన వద్ద ఉన్న వస్తువులను తీసుకోమని.. తన డెబిట్ కార్టు పిన్‌నంబర్‌ను సైతం వారికి తెలియపరిచినట్లు వెల్లడించారు. అయినప్పటికీ దోషులు జిగీషను వదల్లేదని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలిపై దోషులు అనాగరికంగా, ఆటవికంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై జాలి చూపలేమని తెలిపారు. కాగా, 2008 సెప్టెంబర్‌లో జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసుకేసులోనూ వీరే నిందితులుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement