సాక్షి, ఢిల్లీ : పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునే యత్నంలో ఓ వృద్ధుడు(69) భవనం పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వసంత్ విహార్‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఫైనాన్స్ వ్యాపారం చేసే వీరేంద్ర థింగ్రా ఒకరికి బాకీ పడిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ విషయమై అతనిపై ఒక చీటింగ్ కేసు కూడా నమోదైంది. పోలీసులకు దొరక్కుండా వీరేంద్ర గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు.
అయితే అతను సోమవారం వసంత్ విహార్‌లోని తనయుడు సంజయ్ ఇంటికి వచ్చాడు. అతని ఆచూకీ పసిగట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకుందామని ఆ ఇంటికి చేరుకున్నారు. కానీ, పోలీసులను చూసి తనను అరెస్టు చేస్తారని భయపడిన థింగ్రా భవనం పైకెక్కి దూకేశాడని పోలీసులు వెల్లడించారు. ‘థింగ్రా ఫైనాన్స్ వ్యాపారి. ఒకరికి డబ్బు చెల్లించడంలో విఫలమవడంతో అతనిపై ఒక చీటింగ్ కేసు నమోదై ఉంది. ఈ విషయమై అతను తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో రాసి ఉంది’ అని సౌత్‌వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ మిలింద్ దుంబెర్ చెప్పారు.
సూసైడ్ నోట్‌లోని చేతిరాత వీరేంద్రదా, కాదా? అనేది తేల్చాల్సివుందని ఆయన చెప్పారు. కానీ, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం వీరేంద్రది హత్యేనని ఆరోపిస్తున్నారు. ‘మా నాన్నను ఎవరో చంపేశారాని నాకొక ఫోన్ కాల్ వచ్చింద’ని థింగ్రా తనయుడు సంజయ్ తెలిపారు. కేసుకు సంబంధించి ఇంతవరకూ అనుమానితులను గుర్తించలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment