పేషెంట్ అక్రమ నిర్బంధం: ఆస్పత్రిపై కోర్టు ఆగ్రహం
ఆస్పత్రులు బిల్లులు పేల్చేసి, చివరి పైసా కట్టేదాకా పేషెంట్ ను వదిలేది లేదని భయపెట్టే ఆస్పత్రులకు ముంబాయి హైకోర్టు దిమ్మదిరిగే ఆదేశాలిచ్చింది. తక్షణమే అక్రమంగా నిర్బంధించి ఉంచిన పేషెంట్ ను విడుదల చేయించమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ముంబాయికి చెందిన సంజయ్ ప్రజాపతి తన తమ్ముడికి తలకు దెబ్బ తగిలితే ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అయితే ట్రీట్ మెంట్ సరిగ్గా జరగడం లేదని అతనికి అనుమానం వచ్చింది. దాంతో వేరే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రి అధికారులు 4.56 లక్షలు చెల్లించమన్నారు. అందులో ఆయన 2.76 లక్షలు చెల్లించాడు. మిగతా మొత్తం విషయంలో తనకు అభ్యంతరాలున్నాయన్నాడు. అది చెల్లిస్తేనే తప్ప డిశ్చార్జి చేసేది లేదని ఖరాఖండిగా చెప్పారు ఆస్పత్రి అధికారులు. చేసేదేమీ లేక ప్రజాపతి కోర్టు తలుపులు తట్టాడు.
కేసు విన్న హైకోర్టు ఆస్పత్రి తీరును గర్హించడమే కాక, తక్షణమే పేషంట్ ను విడుదల చేసేలా చూడమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు విన్న న్యాయమూర్తి కనాడే ఆస్పత్రి సిబ్బంది, అధికారులు పేషంట్లను ఇలా అక్రమంగా నిర్బంధించడానికి వీల్లేదని అన్నారు. తాను ఒక పేషంట్ కు గ్యారంటీగా ఉన్నా ఒక ఆస్పత్రి అధికారులు పేషంట్ ను నిర్బంధించిన వైనాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ చర్యను ఆయన అమానుషమైనదిగా పేర్కొన్నారు.