నేనేదో జోక్ చేశాను అంతే..
భోపాల్: వ్యాపమ్ స్కామ్పై తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కైలాస్ విజయ్ వార్గీయ సమర్థించుకున్నారు. పైపెచ్చు మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ ఎదురుదాడి చేశారు. 'నేనేమీ వివాదాస్పదగా మాట్లాడలేదు. నేనేదో జోక్ చేశాను అంతే అంటూ కైలాస్ విజయ్ వార్గీయ తనను తాను వెనకేసుకొచ్చుకున్నారు. మీడియా తన వ్యాఖ్యాలను అనవసరంగా రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు.
వరుస అనుమానాస్పద మరణాలతో మరణ మృదంగాన్ని మోగిస్తున్న వ్యాపమ్ కేసులో మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. 48 వరుస అనుమానాస్పద మరణాలతో కిల్లింగ్ స్కాంగా పేరుగాంచిన ఈ కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మంత్రులు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో వివాదాన్ని రగిలిస్తున్నారు.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మరణంపై మంత్రి కైలాస్ విజయ్ వార్గీయ స్పందనను మీడియా కోరినపుడు ... చచ్చిపోయిన ఆ జర్నలిస్టు గురించి మర్చిపోండి... అతను నాకంటే గొప్పవాడా ఏంటి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జర్నలిస్టు మరణాన్ని చాలా తేలిగ్గా తీసి పారేస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు మీడియాలో ప్రసారం కావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. దీంతో మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.
కాగా స్కాంలో రిపోర్టింగ్లో ఉన్న జర్నలిస్టు అక్షయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అలాగే ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్కు సహకరిస్తున్న జబల్ పూర్ యూనివర్శిటీ డీన్ అరుణ్ శర్మ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన విచారణ నివేదికను సమర్పించిన రెండురోజుల తర్వాత ఢిల్లీలోని ఒక హెటల గదిలో ఆయన చనిపోయారు. మరోవైపు ఈ కేసులో ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ అనామిక కుస్వాహ సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై తేలారు.