ప్రధాన న్యాయమూర్తిగా దత్తు
న్యూఢిల్లీ: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు(63) శుక్రవారం నియమితులయ్యారు. ఆయన 14 నెలలు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత సీజేఐ ఆర్‌ఎం లోధా ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. దత్తును తదుపరి సీజేఐగా నియమించారని, నియామకం ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తుందని న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. నియామకంపై రాష్ట్రపతి సంతోషంగా ఉన్నారని పేర్కొంది. సుప్రీం కోర్టులో జస్టిస్ లోధా తర్వాత అత్యంత సీనియర్ న్యాయ మూర్తి అయిన దత్తు ప్రస్తుతం 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై దర్యాప్తులను పర్యవేక్షిస్తున్నారు. సుప్రీం కోర్టు 42న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన వచ్చే ఏడాది డిసెంబర్ 2న రిటైర్ అవుతారు. దత్తు 1950లో కర్ణాటకలో జన్మించారు. ఆయన తండ్రి స్కూల్ టీచర్.
దత్తు 1975లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1983 నుంచి కర్ణాటక హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 1995లో కర్ణాటక హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. తర్వాత కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, 2007లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. ఈ ఏడాదిలో సీజేఐగా నియమితులైన వారిలో ఆయన రెండో వ్యక్తి. లోధా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ పదవిలో నియమితులయ్యారు. భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే ఉత్తమమైందని, దాన్ని ఉన్నతస్థాయికి చేరుస్తానని దత్తు బుధవారం మీడియాతో చెప్పారు. సీజేఐగా తన నియమాకానికి సంబంధించిన ఫైలు ఆ రోజు పీఎంఓకి చేరడంతో ఆయన స్పందించారు.