కన్హయ్యపై మరో ఆరోపణ
యువతితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొత్త వివాదం
* సామాజిక మాధ్యమంలో లేఖల హల్‌చల్
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన కన్హయ్య కుమార్‌పై మరో ఆరోపణ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. గతేడాది జేఎన్‌యూలో తనకు అడ్డుచెప్పినందుకు ఓ యువతి (ఇప్పుడామె ఢిల్లీ వర్సిటీలో బోధిస్తున్నారు)తో కన్హయ్య అసభ్యంగా ప్రవర్తించాడని.. అందుకు రూ.3000 జరిమానా చెల్లించాలంటూ వర్సిటీ ప్రోక్టర్ పేరుతో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖలో ప్రోక్టర్ సంతకం లేదు. అయితే సదరు యువతి ఈ వివాదం నిజమేనంటూ ఓ బహిరంగ లేఖ కూడా సామాజిక మాధ్యమం ద్వారానే బయటపెట్టారు.
సదరు బహిరంగ లేఖలో సదరు యువతి కన్హయ్యపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాల ప్రకారం, 2010 జూన్ 10న కన్హయ్య (అప్పటికి వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నికవలేదు) బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండగా అది సరికాదని అటుగా వెళ్తున్న యువతి సూచించారు. దీంతో ఆగ్రహించిన కన్హయ్య.. ఆ అమ్మాయిని మానసికరోగి అని సంబోధించటంతోపాటు.. అసభ్యంగా ప్రవర్తించి, ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
దీంతో యువతి వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన వీసీ.. విచారణ జరపాలంటూ ప్రొక్టోరియల్ కమిటీని ఆదేశించారు. ఈ కమిటీ విచారణ జరిపి కన్హయ్యను దోషిగా తేల్చింది. క్రమశిక్షణారాహిత్యమైన తీవ్రమైన చర్యగా పేర్కొంది. మాజీ విద్యార్థిని కూడా అయిన యువతితో అసభ్యంగా ప్రవర్తించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే.. కన్హయ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరోసారి ఇలా ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించిన వీసీ కేవలం రూ.3వేల జరిమానా విధించి వదిలేశారని.. 2015 అక్టోబర్ 16న చీఫ్ ప్రోక్టర్ కృష్ణకుమార్ పేరుతో విడుదలైన ఆర్డర్ తెలిపింది.
కన్హయ్య తప్పుగా ప్రవర్తించి తనను బెదిరించాడని.. ఇందుకు శిక్ష కూడా పడిందని ఆమె పేర్కొంది. ‘అసత్యపు విప్లవకారుడిని తయారుచేసిన నా జేఎన్‌యూ సమాజాన్ని చూసి ఆవేదన కలుగుతోంది. నీచమైన మనస్తత్వం ఉన్న కన్హయ్య.. మహిళల గౌరవాన్ని మంటగలిపిన వ్యక్తి ఉద్యమాన్ని నడుపుతాడా?’ అంటూ ఆ యువతి బహిరంగ లేఖ రాశారు.
అది వాస్తవమే కానీ!
దీనిపై స్పందించిన ఏఐఎస్‌ఎఫ్ ‘యువతి పేర్కొన్న ఘటనపై ఆమెతో కన్హయ్యకు వాగ్వాదం జరిగిన మాట వాస్తవమే.. అయితే.. చాలాసార్లు లింగ సమానత్వం కోసం కన్హయ్య పోరాడారు’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, జేఎన్‌యూలో గురువారం ఓ సెమినార్‌కు హాజరైన కన్హయ్య కుమార్‌ను ఓ గుర్తుతెలియని వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది ఆగంతకుడిని పట్టుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.