బెంగుళూరు : తబ్లీగి జమాత్, అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారి నుంచే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగల్లాగా రాష్ట్రంలో ప్రవేశించి కరోనా వ్యాప్తికి కారకులయ్యారని దుయ్యబట్టారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లోని దర్గాకు హాజరైన దాదాపు 1900 మంది, తబ్లీగికి వెళ్లొచ్చిన 500 మంది ద్వారానే కర్ణాటకలో సెకండరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాప్తికి కారకులయ్యారని ఆరోపించారు. మేధావులుగా పిలువబడే సమాజ పెద్దలు తబ్లీగీల చర్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
అంతేకాకుండా ఆశా వర్కర్లపై జరుగుతున్న దాడులను ఖండించిన రవికుమార్.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఒక మతానికి కరోనాను అంటగడుతూ, వారి వల్లే ఇలా జరిగిందని దూషించడం ఎంత మాత్రం సమంజసం కాదని ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవికుమార్ స్పందిస్తూ.. పార్టీ వైఖరి, వ్యక్తిగత అభిప్రాయాలు వేర్వేరని పేర్కొన్నారు. ఇప్పటివరకు కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 862కి చేరగా, 31 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది.
(మా షాపులో ముస్లింలెవరు పనిచేయడం లేదు!)
Comments
Please login to add a commentAdd a comment