రూ.1.38 లక్షల పట్టుచీర కొన్న సీఎం
సాక్షి, బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. రూ.1.38 లక్షల విలువైన పట్టు చీరను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.
మంగళవారం దావణగెరెలోని మహానగర పాలికె పరిధిలో నూతనంగా నిర్మించిన వ్యాపార భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మైసూరు పట్టు చీరల వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ ప్రదర్శించిన పట్టు చీరలను పరిశీలిస్తూ అద్భుతంగా ఓ చీర కన్పించడంతో దాన్ని కొనుగోలు చేశారు.
కొద్ది రోజుల క్రితం బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేశ్ చెంప చెళ్లుమనిపించి సిద్ధరామయ్య పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు విలువైన చీర కొని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.