వ్యాపారి కిడ్నాప్.. డీఎస్పీ ఆత్మహత్య
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఫైనాన్షియర్ కిడ్నాప్ కేసులో సస్పెండైన కర్టాటక పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కమంగళూరు డిప్యూటీ సూపరింటెండెంట్ కల్లప్ప హండీబాగ్ ఆత్మహత్య చేసుకున్నారు. చిట్ ఫండ్ వ్యాపారి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లప్పను పోలీసు అధికారులు మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారు. అనంతరం బెల్గావ్ లోని మురగోడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
కిడ్నాప్ గురైన ఫైనాన్షియర్ తేజస్ (37) తన ఇంటి సమీపంలో కారు పార్క్ చేస్తుండగా ఓ ముఠా కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి ఒక గోడౌన్ లో బందీ చేసింది. అనంతరం 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చిత్ర హింసలకు గురిచేసింది. వారి హింస భరించలేక తేజస్ రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ చెల్లింపుల కోసం కిడ్నాపర్లు ఒక ఫోన్ నెంబరు ఇచ్చారు. చిక్కమగళూరులోని స్నేహితుడు షివు ద్వారా ఈ మొత్తం చెల్లించి తేజస్ బయటపడ్డాడు. అయితే ఇక్కడే కథ మరో టర్న్ తీసుకుంది.
కిడ్నాపింగ్ కోసం ఉపయోగించిన స్కార్పియో నంబరు, ఫోన్ నంబరు ద్వారా కూపీ లాగిన అతని స్నేహితులు డీఎస్పీ గుట్టు రట్టుచేశారు. 10 లక్షల చెల్లింపు సందర్భంగా కిడ్నాపర్ల ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వాహనం, మొబైల్ నంబరు డీఎస్పీ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్టు తేలడంతో బసవన్ హళ్లి పోలీసు స్టేషన్ లో డీఎస్పీ కల్లప్పపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఐదో నిందితునిగా కల్పప్పపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన డీఎస్పీ బెయిల్ పై విడుదలయ్యారు. అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.