ఓటరు కార్డు రూపంలో తయారుచేయించిన సిద్డప్ప పెళ్లి శుభలేఖ
బెంగళూరు: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ వేడుకకు సంబంధించిన అంశాలను ప్రతి జంట తమ జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటుంది. కర్ణాటకకు చెందిన ఓ జంట కూడా అలానే అనుకుంది. అనుకోవడమే కాక ఓ వినూత్నమైన ఆలోచన కూడా చేశారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు తమ పెళ్లి పత్రికను ఓటరు కార్డు రూపంలో డిజైన్ చేయించారు. వినూత్నమైన పెళ్లికార్డుకు కర్ణాకటలోని హవేరి జిల్లా వేదికైంది. జిల్లాలోని హంగల్ ప్రాంతానికి చెందిన సిద్దప్ప దొడ్డచిక్కన్ననవార్ భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. సామాజిక కార్యకర్త కూడా అయిన సిద్దప్పకు ఇదే ప్రాంతానికి చెందిన జ్యోతితో వివాహం నిశ్చయం అయింది. ఈ నెల 27న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు.
'నా వివాహ వేడుక సందర్భంగా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా. ఇదే విషయాన్ని పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నా స్నేహితుడి వద్ద ప్రస్తావించాను. ఇద్దరం ఆలోచించి పెళ్లి పత్రికను ఓటరు కార్డు రూపంలో అచ్చు వేయించాలనుకున్నాం. అందుకుగాను జిల్లా కలెక్టరు అనుమతి కూడా తీసుకున్నామని' తెలిపాడు సిద్దప్ప. ఓటరు ఐడీలో వివరాలు ఎలా ఉంటాయో అలానే తన వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను రూపొందించాడు. శుభలేఖ చివర్లో మీ ఓటు ఎంతో విలువైనది దాన్ని అమ్ముకోకండి అనే సందేశాన్ని కూడా అచ్చువేయించడం గమనార్హం. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మే 12న కర్ణాటకలో 224 నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 56,696 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. మే 15న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment