జయ కేసు మరో కీలక మలుపు తిరగనుందా?
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తేలిన అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత కేసు మరో కీలక మలుపు తిరగనుందా? ఈ మేరకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ కేసులో జయలలితను నిర్దోషిగా తేల్చిన కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర న్యాయశాఖామంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. అప్పీలు చేసుకునేందుకు 90 రోజులు గడువున్నప్పటికీ తీర్పు వచ్చిన 20 రోజుల్లోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు
మరోవైపు ఈ కేసులో జోక్యం చేసుకునే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే రెండుసార్లు చెప్పింది. అప్పీలుకు వెళ్లాల్సిందిగా ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడాన్ని కరుణ గతంలో ప్రస్తావించారు. కాగా, కేసులో అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కర్ణాటక పీసీసీ లీగల్, మానవ హక్కుల విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ కేసులో కర్టాటక పాత్ర 'పరిపాలన' వరకే పరిమితమని ఆ విభాగం చైర్మన్ ధనుంజయ పేర్కొన్నారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్షపడడం, ఆ తర్వాత ఈ కేసు నుంచి జయ నిర్దోషిగా తీర్పు వెలువడడంతో ఈనెల 23 వ తేదీన జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు.