భక్తులకు అమ్మ దర్శనమయ్యేనా ?
అమ్మా అని పిలిచినా ఆలకించవే అమ్మా.. అంటూ తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం విలపిస్తున్నారు. ఆయనతో పాటు.. తమిళ మంత్రివర్గం యావత్తు బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు వద్ద బారులు తీరుతోంది. కానీ అమ్మ పురచ్చితలైవి జయలలిత మనసు మాత్రం కొంచం కూడా కరగడం లేదు. ఇన్నాళ్ల పాటు రోజూ తనకు పాదాభివందనాలు చేసిన మంత్రులను ఆమె కరుణించడంలేదు.
కర్ణాటక హైకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురికావడంతోనే ఆమె భక్తులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అమ్మ కోసం... ఎంతవరకైనా వెళతామంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. దాంతో బెయిల్ ఎప్పుడొస్తుందా అని వాళ్లంతా కొండంత ఆశతో సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు. వాళ్ల ఆశలు నెరవేరుతాయో, లేదో చూడాలంటే మాత్రం శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.
తమిళనాడు మాజీ సీఎం జయలలితను సాధ్యమైనంత త్వరగా ఆమె స్వరాష్ట్రానికే పంపాలని కర్ణాటక భావిస్తుంది. ఆమెను చూసేందుకు వేలాది సంఖ్యలో తమిళ తంబిలు బెంగళూరు జైలుకు చేరుకుంటున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జయలలితను తమిళనాడుకు తరలించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం బహిరంగంగా తన అభిప్రాయాన్ని ప్రకటించింది. కానీ ఈ విషయంలో సుప్రీం ఏమంటుందో మాత్రం ఇంకా చూడాలి.