రెండు వారాల్లో తీర్పు
మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్ణాటక హైకోర్టులో ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై మరో రెండు వారాల్లో తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిసిపోగా రెండు వారాల్లో తీర్పు ఖాయమని భావిస్తున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిం చారు. జయతోపాటూ శశికళ , ఇళవరసి, సుధాకర్‌కు సైతం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ, బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన జయలలిత బెయిల్‌పై వచ్చిన తరువాత తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేశారు. జయ ఆస్తుల కేసుపై ఇప్పటికే 18 ఏళ్లు విచారణ సాగినందున మూడు నెలల్లోగా అప్పీలుపై తీర్పు చెప్పాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో కర్ణాటక హైకోర్టులో ప్రతి రోజు విచారణ సాగుతోంది.
నలుగురి తరపున న్యాయవాదులు కోర్టుకు హాజరై 31 రోజుల పాటూ వాదనను వినిపించారు. ఇక ఆరు సంస్థల తరపున న్యాయవాదుల వాదన శుక్రవారం ప్రారంభమైంది. నిందితులు నలుగురికి తమ సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని, సంస్థలు ప్రారంభించినపుడు వారు నలుగురూ షేర్ హోల్డర్లు కాదని వాదించారు. కాబట్టి ఈ కేసు నుంచి తమ ఆరు సంస్థలకు విముక్తి ప్రసాదించాలని కోరారు. న్యాయవాదుల వాదన పూర్తి అయిన అనంతరం న్యాయమూర్తి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రయివేటు సంస్థలు తమ వాదనను ఈనెల 23వ తేదీతో ముగించాలని, ఆ తరువాత ప్రభుత్వ న్యాయవాది భవానిసింగ్ తన చివరి వాదనను పూర్తిచేయగానే తీర్పు తేదీని ప్రకటిస్తామన్నారు.
చివరి వాదనను వినిపించేందుకు ఐదురోజులు అవకాశం ఇవ్వాలని భవానీసింగ్ కోరారు. ఈ అభ్యర్థనను నిరాకరించిన న్యాయమూర్తి 23వ తేదీన ఆరు సంస్థల వాదన ముగియగానే 24వ తేదీ నుంచి తమ వాదనను వినిపించాలని భవానీసింగ్‌ను ఆదేశించారు. ఈ కారణాల వల్ల మార్చి మొదటి వారంలో జయ అప్పీలుపై న్యాయమూర్తి తీర్పు ఖాయమని కర్ణాటక హైకోర్టు వర్గాలు భావిస్తున్నాయి.