కార్తీ విదేశాల్లో ఏం చేస్తారంటే..
కార్తీ విదేశాల్లో ఏం చేస్తారంటే..
Published Fri, Sep 22 2017 5:31 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
సాక్షి, న్యూఢిల్లీః అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం విదేశాలకు వెళితే విచారణకు ఇబ్బందులు ఎదురవుతాయని సీబీఐ శుక్రవారం సుప్రీం కోర్టుకు నివేదించింది. కార్తీ పలు విదేశీ ఖాతాలను మూసివేస్తున్నారని, అందుకే ఆయన విదేశీ పర్యటనలను అడ్డుకునేలా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణలో పలు అంశాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉందని దర్యాప్తు అంశాలను సీల్డ్ కవర్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ముందుంచేందుకు అనుమతించాలని సీబీఐ కోరింది. దీనికి సీనియర్ న్యాయవాది, కార్తీ అడ్వకేట్ కపిల్ సిబల్ అభ్యంతరం తెలిపారు.
అయితే విదేశాల్లో కార్తీ ఏం చేశారన్నది సీల్డ్ కవర్‌లో .పొందుపరిచారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. విచారణ సందర్భంగా తనకు విదేశాల్లో ఒకే ఖాతా ఉందని చెప్పిన కార్తీ తను విదేశాలు వెళ్లినప్పుడు పలు విదేశీ బ్యాంకు ఖాతాలను మూసివేశారని ఆ అంశాలు సీల్డ్ కవర్‌లో ఉన్నాయని మెహతా కోర్టుకు వెల్లడించారు. దీనిపై కపిల్ సిబల్ అభ్యంతరం తెలుపుతూ విదేశీ బ్యాంకు ఖాతాలపై కార్తీ సంతకాలు ఉంటే ఆయనను ఫెమా, బ్లాక్ మనీ కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రాసిక్యూట్ చేయవచ్చని సిబాల్ అన్నారు.
Advertisement