
23న సీబీఐ ఎదుటకు కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసుకు సంబంధించి ఈనెల 23న సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. తన తండ్రి, కాంగ్రెస్ నేత చిదంబరంను టార్గెట్ చేసిన ప్రభుత్వం కేసుల పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నదని కార్తీ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్ చేయడం ఫ్యాషన్‌గా మారిందని కార్తీ న్యాయవాది గోపాల్ సుబ్రమణియన్ వాదించారు. కార్తీ తన వాదనలను సమర్థించుకుంటున్న క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ జోక్యం చేసుకుంది.
‘మీరు చాలా మంచివారు కాబట్టి మీరు సీబీఐ ఎదుట హాజరుకానని చెప్పదలుచుకున్నారా’ అని బెంచ్ కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించింది. సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు తాను భయపడటం లేదని..అయితే తనకు భద్రత కావాలని కార్తీ చిదంబరం ఈ సందర్భంగా కోర్టును కోరారు. న్యాయవాదితో కలిసి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. అయితే విచారణ సమయంలో న్యాయవాది దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. మరోవైపు కార్తీ లుక్ అవుట్ నోటీసుపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.