‘అమర్‌నాథ్’ మృతుల వివరాల వెల్లడి
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఏడుగురు అమర్‌నాథ్ యాత్రికుల పేర్లను జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతదేహాలను శ్రీనగర్ నుంచి సూరత్‌కు హెలికాప్టర్‌లో తరలించనున్నారు.
అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఉదయం 9.45 గంటలకు ఢిల్లీలోని తన నివాసంలో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు కశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోరా కూడా శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో నేడు పర్యటించనున్నారు.
మృతుల వివరాలు
1. హాసుబెన్ రాటిలా పటేల్
2. సురేఖ బెన్
3. పటేల్ లక్ష్మీబెన్
4. ఉషా మోహన్‌లా సొనాకర్
5. థాకూర్ నిర్మలాబెన్
6. రతన్ జినాభాయ్ పటేల్
7. ప్రజాపతి చంపాబెన్