ఉగ్రవాదుల దుశ్చర్య
అమర్‌నాథ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మహాశివుడు పార్వతీదేవికి అక్కడ ముక్తి రహస్యాన్ని బోధించాడని భక్తుల విశ్వాసం. నూటయాభైయ్యేళ్లక్రితం ఆ గుహనూ, అక్కడి హిమలింగాన్నీ బయటి ప్రపంచానికి వెల్లడించింది ఒక ముస్లిమే. ఆనాటి నుంచీ ఏటా లక్షలమంది భక్తులు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి బస్సులో తిరిగి వస్తున్న గుజరాత్ యాత్రికులపై సోమవారం రాత్రి 8.30 సమయంలో ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురిని పొట్టనబెట్టుకున్నారు. మరో 19మందిని గాయపరిచారు.
అన్నివైపుల నుంచీ తూటాల వర్షం కురుస్తున్నా బస్సు డ్రైవర్ సలీం షేక్ సమయస్ఫూర్తితో, సాహసంతో, పెను వేగంతో బస్సు నడపడం వల్ల మరో 50మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. గత నెల 29న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు ఈసారి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం(సీఆర్‌పీఎఫ్), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్)లకు చెందిన దాదాపు 25,000 మంది జవాన్లు కీలకమైన ప్రాంతాల్లో మోహరించి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. వారి వాహనాలకు వెనకా, ముందూ రక్షణగా వెళ్తున్నారు. ఇంతవరకూ 1,46,692మంది యాత్రికులు హిమలింగాన్ని సందర్శించుకున్నారని అధికారులు చెబుతున్నారు.
కానీ ఇన్ని ఏర్పాట్లు చేసినా ఉగ్రవాదులు యాత్రికులపై కాల్పులు జరిపి తప్పించుకు పోగలిగారు. దాడి జరిగిన ప్రాంతం మారుమూల అటవీ ప్రదేశం కాదు. అది జమ్మూ–కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జాతీయ రహదారిపై ఉంది. ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతా దళాలు కాల్చి చంపి ఏడాది కావస్తున్నందున ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చునని ఊహాగానాలున్నాయి. ప్రత్యేకించి అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు పథకరచన చేస్తున్నారని, కనీసం వందమందిని హతమార్చాలన్నది వారి లక్ష్యమని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని చెబుతున్నారు. అందువల్లే రెండురోజులపాటు యాత్రను ఆపి సోమవారం పునఃప్రారంభించారు. అమర్‌నాథ్ ఆలయాన్ని చేరుకోవడానికి ఉన్న బల్టాల్, పహల్గావ్ మార్గంలో జవాన్లు పహరా కాస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయో తాజా ఉదంతం చూస్తే అర్ధమవుతుంది.
నిబంధనల ప్రకారం ఈ బస్సు అమర్‌నాథ్ ఆలయ బోర్డు వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. అలా రిజిస్టర్ చేయించుకున్న బస్సులు అయిదారింటిని ఒకేసారి పంపుతూ వాటికి సీఆర్‌పీఎఫ్ రక్షణ కల్పిస్తారు. కానీ ఈ బస్సుకు అలాంటి రిజిస్ట్రేషన్ లేదని చెబుతున్నారు. కాదు రిజిస్టర్ చేయించుకున్నామని డ్రైవర్ సలీం షేక్ అంటున్నాడు. ఇందులోని నిజానిజాలు నిలకడగా తెలుస్తాయి. రిజిస్టర్ కాకపోవడం నిజమైతే బస్సు అంత భద్రతా వలయాన్ని దాటుకుని అసలు బల్టాల్ వరకూ ఎలా వెళ్లగలిగింది? భద్రతా వాహనాల తోడు లేకుండా, కాన్వాయ్‌లో భాగం కాకుండా ఒంటరిగా సాగుతున్న బస్సుపై వెళ్లేటపుడూ, వెనక్కు వస్తున్నప్పుడూ కూడా ఎవరికీ అనుమానం ఎందుకు కలగలేదు? చెక్‌పోస్టుల వద్ద ఆరా ఎందుకు తీయలేదు? తిరుగు ప్రయాణంలో రిపేర్ అవసరంతో బస్సు మార్గమధ్యంలో దాదాపు గంటన్నర ఆగిపోయిందంటున్నారు. కేవలం ఏడు గంటల సమయం వరకూ మాత్రమే వాహనాలు ప్రయాణించడానికి అనుమతిస్తారని, ఆ తర్వాత నిలిపేస్తారని చెబుతున్నారు. అలాంటపుడు ఈ బస్సు ఎలాంటి రక్షణా లేకుండా అన్ని కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణించింది? ఇప్పటికైతే ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు. పరిస్థితులు సరిగా లేవని గుర్తించి నిబంధనలు ఏర్పర్చుకున్నప్పుడే వాటిని ఉల్లంఘించిన సందర్భాలు ఎదురైతే ఏం చేయాలన్న అవగాహన ఉండాలి. రిజిస్టర్ చేయించుకోని వాహనాలను ఆపేయాలి. దాడికి గురైన వాహనం డ్రైవర్ చెబుతున్నట్టు రిజిస్టర్ చేయించుకుని ఉంటే వారికి ఎందుకు సరైన భద్రత లేదన్న సంగతి తేలాలి.
సరిగ్గా పదిహేడేళ్లక్రితం 2000 సంవత్సరంలో ఉగ్రవాదులు పహల్గావ్‌లో దాడిచేసి 30మంది యాత్రికులను పొట్టనబెట్టుకున్నారు. అనంతరకాలంలో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో కూడా ఏనాడూ ఉగ్రవాదులు ఇలా బరితెగించడం సాధ్యంకాలేదు. ప్రస్తుత దాడికి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చురుగ్గా ఉన్న లష్కరే తొయిబా కారణం కావొచ్చని అంటున్నారు. దాదాపు అన్ని పార్టీలూ, సంస్థలూ ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించడం హర్షించదగ్గ విషయం. హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు సయ్యద్ అలీ షా గిలానీ, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ మొదలుకొని నేషనల్ కాన్ఫరెన్స్ వరకూ అందరూ ఉగ్రవాదుల దుర్మార్గాన్ని నిరసించారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే వాళ్లు కొందరైతే, రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి గవర్నర్ పాలన పెట్టాలని డిమాండ్ చేసేవారు మరికొందరు. ఇంకొందరు ప్రబుద్ధులు మూక దాడులను వ్యతిరేకిస్తూ ఈమధ్య జరిగిన ‘నాట్ ఇన్ మై నేమ్’ ఉద్యమాన్ని ఎత్తిచూపుతూ ఆ ముఠాలోని వారు మాట్లాడరేమిటని నిలదీశారు.
నిజానికి ‘నాట్ ఇన్ మై నేమ్’ ఉద్యమకారులు ఈ దాడిపై మౌనంగా లేరు. దాన్ని ఖండించారు. అన్ని రకాల హింసకూ వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అందరూ ఏకమై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించాల్సిన సమయంలో సందు దొరికిందని రాళ్లేయాలని చూడటం అపరిపక్వతను చాటుతుంది. అటువంటి ప్రకటనల వల్ల అంతిమంగా లాభపడేది ఉగ్రవాదులే. సమాజంలో చీలికలు తెచ్చి దాన్ని ధ్వంసం చేయాలని, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగల్చాలని ఉగ్రవాదుల పన్నాగం. కనుక ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అమర్‌నాథ్ యాత్ర వచ్చే నెల ఏడో తేదీ వరకూ ఉంటుంది. జరిగిన సంఘటన నుంచి గుణపాఠం తీసుకుని, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గమనించుకుని, అవి పునరావృతం కాకుండా భద్రత, నిఘా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంగతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి.