
సైనికుల సంయమనానికి హాట్సాప్?
శ్రీనగర్: కశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి గత ఆదివారం జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా విధులను ముగించుకొని ఈవీఎంలతో నిర్దేశిత ప్రాంతాలకు వెనుతిరిగి వస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల పట్ల స్థానిక ప్రజలు ఎంతో అనుచితంగా ప్రవర్తించారు. ఎంతో హేళన చేశారు. వెంటబడి వెంటబడి ఏడిపించారు. యువకులు ‘ఆజాద్, గో బ్యాక్ ఇండియా’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, సైనికులతోనూ ఆజాద్ అంటూ నినాదాలు చేయించారు. అంతటితో ఆగకుండా వారిని చేతుల మీద తన్ని, చెంపల మీద గిల్లారు. తలలమీద కొట్టేందుకు ప్రయత్నించారు.
ఇంత జరుగుతున్నా, చేతుల్లో తుపాకులు ఉన్నప్పటికీ సైనికులు ఏ మాత్రం రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. వారి నుంచి తప్పించుకొని వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరేందుకే ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతోంది. సైనికులు చూపిన సహనానికి ఇటు పోలీసులు, అటు ప్రజలు ‘హాట్సాఫ్ టు యు’ అంటూ సైనికులకు అభివాదం చేస్తున్నారు. ఏ మాత్రం రెచ్చిపోయి అల్లరి మూకలపైకి కాల్పులు జరిపినా ఎంతో మంది పిల్లల ప్రాణాలు గాల్లో కలసిపోయేవని, ఎంతో మంది తల్లులకు గర్భశోఖం మిగిలేదని ఈ సంఘటనపై స్పందించిన జమ్మూ కశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ వైద్ వ్యాఖ్యానించారు.
ఈ వీడియో చూసిన వారు కూడా ‘సైనికులు ఎందుకు అంత ఉపేక్షించారో, కాల్పులు జరిపితే వారికి తెలిసొచ్చేది’ అంటూ ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. అప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది యువకులు మరణించారు. అలా మరణించిన వారి శవాలను చూడడం వల్లనే కశ్మీర్ యువత ఇలా రెచ్చిపోయిందని, గతంలో ఎంతో మంది అమాయకులు సైనికుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారన్నకసితోనే వారు ఇలా ప్రవర్తించారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమర్థించారు.
ఆదివారం నాడు అనేక ప్రాంతాల్లో రీపోలింగ్‌ను వాయిదా వేయడం వల్ల మంగళవారం నాడు తిరిగి శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి రీపోలింగ్ నిర్వహించారు. అయినా ఓటు వేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదు. మొత్తం 27 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు. దాదాపు 35 వేల మంది తమ ఓటు హక్కు నమోదు చేసుకోగా, 38 పోలింగ్ కేంద్రాల్లో కలసి కేవలం 679 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. గత 36 ఏళ్లలో ఎన్నడూ ఇంత తక్కువ పోలింగ్ జరగలేదు. కశ్మీర్ ప్రజల్లో ఎన్నికల పట్ల ఎంత వ్యతిరేకతుందో ఇది స్పష్టం చేస్తోంది.