సీక్రెట్ బ్రౌజర్లతో వాళ్లేం చేస్తున్నారు?
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం కొన్నాళ్ల పాటు నిషేధించడంతో కశ్మీరీ యువత కొత్త దారులు వెతుక్కుంటోంది. సీక్రెట్ బ్రౌజర్లు ఉపయోగించి తమకు కావల్సిన సామాజిక మాధ్యమాలన్నీ చూసుకుంటోంది. ఉచితంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో తాము చెప్పదలచుకున్న విషయాలను వీడియోలు, ఫొటోల ద్వారా ప్రచారం చేస్తూ కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలను మరింత రెచ్చగొడుతున్నారు. ఈ విషయాలన్నీ అధికారుల దర్యాప్తులో తెలుస్తున్నాయి. నిషేధం విషయాన్ని ప్రకటించక ముందునుంచే తమకు ప్రత్యామ్నాయం ఉందని తెలుసని, ఇంతకుముందు కూడా ఇలాగే ఇంటర్‌నెట్‌ను నిషేధించినా తాము వాడుకున్ఆనమని కశ్మీర్ యూనివర్సిటీ ఉద్యోగి జహూర్ అహ్మద్ తెలిపారు. తాను ఇప్పటికీ ఫేస్‌బుక్ ఎంచక్కా వాడుతున్నట్లు ఆయన చెప్పారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్కింగ్ (వీపీఎన్)తో పాటు సిగ్నల్ లాంటి ఎన్‌క్రిప్టెడ్ మెసెంజర్ సర్వీసులు తమకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. వాట్సప్‌ను కూడా నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీపీఎన్ నెట్‌వర్కులకు డిమాండ్ పెరుగుతోంది. నిషేధాన్ని ఎదుర్కోడానికి మార్గాలు ఇవంటూ.. దాదాపు 12 రకాల అప్లికేషన్ల వివరాలను శ్రీనగర్‌కు చెందిన బ్లాగర్ మహ్మద్ ఫైజల్ షేర్ చేశాడు. పౌరులను భద్రతాదళాలు చిత్రహింసలు పెడుతున్నట్లుగా లేనిపోని వీడియోలను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం చేస్తుండటంతో అవి ప్రజాభద్రతకు ముప్పని భావించిన ప్రభుత్వం.. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాను కశ్మీర్‌లో నిషేధించింది.
ఇలా సోషల్ మీడియా సైట్లను నిషేధించే కంటే.. పెద్దపెద్ద వీడియోలు, ఫొటోలు షేర్ కాకుండా చూసుకుంటే మంచిదని సైబర్ మీడియా రీసెర్చ్ నిపుణుడు ఫైజల్ కవూసా చెప్పారు. కశ్మీర్‌లో ఉండి తాను వీడియోను షేర్ చేయలేకపోతే కశ్మీర్ వెలుపల ఉన్నవారి సాయం తీసుకుంటారని, అదే వీపీఎన్ లేదా సిగ్నల్ లాంటి అప్లికేషన్లు వాడితే వాళ్లు ఎక్కడున్నదీ తెలియదని ఆయన వివరించారు. అందుకే వాటి సాయంతో తాము ఎక్కడున్నామో గుర్తించే వీలు లేకుండా విద్వేష వీడియోలను పెట్టేస్తున్నారు. సిగ్నల్ అనేది కూడా వాట్సప్‌లాగే మెసెంజర్. కానీ అది బాగా ఎన్‌క్రిప్ట్ అయి ఉండటంతో ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫైర్‌వాల్ కూడా దాన్ని ఏమీ చేయలేదు.
ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. వేర్పాటువాద శక్తులతో తాము చర్చించేది లేదని.. 'ఆజాదీ' కావాలనుకునే వాళ్లతో తాము ఏం చర్చిస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా స్పష్టం చేసింది. ఆ తర్వాత ఒక వ్యక్తిని జీపు ముందు కట్టి మానవకవచంగా వాడుకున్న వీడియో బాగా వైరల్‌గా వెళ్లింది. దాంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించింది. కానీ వీపీఎన్‌లను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. తన ఫోన్లో తన స్నేహితుడు ఒపెరా వీపీఎన్ డౌన్‌లోడ్ చేసి ఇచ్చాడని, ఆ తర్వాతి నుంచి ఎంచక్కా ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ అన్నీ చూసుకుంటున్నానని శ్రీనగర్ ప్రభుత్వ వైద్యకళాశాల ఉద్యోగి ఒమర్ బెహజాద్ చెప్పాడు.