
కేజ్రీవాల్ కి 'ఇంటి' పోరు
ఇల్లుకట్టి చూడు అన్నది పాత సామెత. ఇల్లుమారి చూడు అన్నది కొత్త సామెత. ఇల్లు మారే కష్టాలు ఇన్నిన్ని కావు. అదీ ఇల్లు మారే వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజరీవాల్ అయితే కష్టాలు డబుల్ అవుతాయి. అందరికీ శకునం చెప్పే బల్లి లాంటి కేజ్రీవాల్ ఇల్లు మారడం విషయంలో కుడితిలో పడ్డంత పనిచేశారు.
ఆయన ఇప్పుడున్న ఇల్లు ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయగానే దాన్ని ఖాళీచేయమని నోటీసులు వచ్చాయి. కానీ ఆయన నా కూతురు పరీక్షలు అయ్యేదాకా ఉంటానని చెప్పారు. అయితే దానికి 85000 రూపాయల అద్దె చెల్లించాలని ఢిల్లీ సర్కారు ఆయనకు నోటీసులు ఇచ్చింది. కేజ్రీ మిత్రులు ఆ అద్దెను చెల్లించారు. చివరికి ఎలాగోలా ఢిల్లీ లోని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లో ఆయన ఒక ఇల్లును వెతికి, అందులో అద్దెకు దిగుతానని ప్రకటించారు. ఇదంతా జూన్ 20 న జరిగింది.
ఆ ఇల్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమారుడైన నరేన్ భిక్కు రామ్ జైన్ ది. ఇంక అందులోకి మారడమే తరువాయి అనుకునే లోపు ఆయనకు మరో అడ్డంకి ఎదురైంది. జూన్ 23 న నరేన్ జైన్ తమ్ముడు వీరేందర్ జైన్ ఆ ఇంట్లో సగం నాది. నా అనుమతి లేకుండా అద్దెకి ఇచ్చేది లేదని ఆయన వాదించారు. దీంతో కేజ్రీవాల్ మళ్లీ ఇల్లు లేని వాడయ్యాడు. ఆయన పార్టీ కార్యకర్తలు పనులు మానుకుని ఇల్లు వెతుకుతున్నారు. మిత్రులు సర్కారుకి ఇప్పుడున్న ఇంటికి అద్దెలు కట్టుకుంటున్నారు.