తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేరళ ప్రభుత్వం ‘జనతా కర్ఫ్యూ’ను తప్పక పాటిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర రవాణా కార్పొరేషన్ బస్సులు రోడ్ల మీదకు రావని.. ఇతర ప్రజా రవాణా వ్యవస్థను కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మెట్రో సర్వీసులు కూడా ఆరోజు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రజలు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని ఈ సందర్భంగా సీఎం విజయన్ పిలుపునిచ్చారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తద్వారా కరోనాపై పోరులో దేశ ప్రజల నిబద్ధతను చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి ప్రబలుతున్న వేళ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, విమానయాన, మీడియా సిబ్బందికి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలపాలని కోరారు. (కరోనా: ప్రధానికి ఒడిశా సీఎం లేఖ)
ఇదిలా ఉండగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 223కు చేరింది. ఇక కేరళలో దేశంలోనే తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా నలుగురు(కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్) మరణించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం కేరళలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి సునిల్ కుమార్ తెలిపారు. విదేశీ బృందానికి చెందిన ఐదురుగు వ్యక్తులకు ఈ మహమ్మారి సోకినట్లు వెల్లడించారు. మున్నార్ అందాలను వీక్షించేందుకు భారత పర్యటనకు వచ్చిన వీరు ప్రస్తుతం.. కొచ్చిలోని హోటల్ క్వారంటైన్‌లో ఉన్నారు.(కరోనా: 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ!)
Comments
Please login to add a commentAdd a comment