ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : కుటుంబాన్ని పోషించడం కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన కొడుకు మరణించడంతో ఓ వృద్ధ జంటకు తీరని వేదన మిగిలింది. కడుపుకోతను తట్టుకుని కనీసం కొడుకు శవాన్నైనా చూడాలనుకుంటే చేదు అనుభవం ఎదురైంది. కొడుకు స్థానంలో మహిళ భౌతిక కాయం కనిపించడంతో చేసేదేమీ లేక మరికొన్నాళ్లు నిరీక్షించక తప్పని పరిస్థితి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాలు.. కేరళలోని పత్నమితిట్టకు చెందిన రఫీక్(29) ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. దురదృష్టవశాత్తూ ఫిబ్రవరి 28న గుండెపోటు రావడంతో అక్కడే మరణించాడు. దీంతో కుమారుడి శవాన్ని ఇంటికి తీసుకువచ్చేందుకు అధికారుల చుట్టూ తిరిగిన అతడి తల్లిదండ్రులు.. గురువారం వచ్చిన శవపేటిక తెరచి చూసి అవాక్కయ్యారు. కుమారుడి స్థానంలో శ్రీలంకకు చెందిన ఓ మహిళ శవం ఉండటంతో బోరున విలపించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కొన్నీ సీఐ పరిస్థితిని పర్యవేక్షించారు. కార్గో సెక్షన్ పొరపాటు వల్ల రఫీక్ మృతదేహం శ్రీలంకకు, అతడి స్థానంలో ఓ మహిళ మృతదేహం ఇక్కడకు వచ్చిందని వారికి నచ్చజెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రఫీక్ శవాన్ని తిరిగి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment