ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో వరదలు ఇంకా కొనసాగుతున్నందున కోచిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26వ తేదీ వరకు మూసివేశారు. పెరియార్ నది ఉధృతంగా ప్రవహిస్తూ విమానాశ్రయం రన్‌వేను నీట ముంచడంతో 11 రోజులుగా విమానాశ్రయాన్ని మూసివేసి ఉంచారు. వరదల కారణంగా విమానాశ్రయం పరసర ప్రాంతాల్లోనే దాదాపు వంద మంది మరణించారు.
1999లో ప్రారంభించిన కోచి విమానాశ్రయానికి ఎందుకింత ముప్పు వచ్చింది? పెరియార్ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాకుండా, రన్‌వే కోసం పెరియార్ నదీ కాలువైన ‘చెంగల్ తోడు’ను, మరో మూడు వ్యవసాయ కాల్వలను మళ్లించారు. పెద్దగా ఉన్న చెంగల్ తోడు కాల్వను మళ్లించినప్పుడు అది చిన్న కాల్వగా మారిపోయింది. మళ్లించిన ఆ కాల్వ పక్కన పేదల గుడిశెలు, తాత్కాలిక ఇళ్లు వెలిశాయి. చెంగల్ తోడును, పంట కాల్వలను మళ్లించడం వల్ల వరద ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆనాటి పర్యావరణ వేత్త నేటి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీఆర్ నీలకందన్ హెచ్చరించినా, సామాజిక కార్యకర్తలంతా కలిసి ఆందోళనా చేసిన నాటి పాలకులు పట్టించుకోలేదట.
కోచి విమానాశ్రయం ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతి పత్రంలో కూడా ‘చెంగల్ తోడు’ అనే చిన్న నీటి కాల్వను మళ్లించాల్సి ఉంటుందని మాత్రమే పేర్కొన్నారట. చెంగల్ తోడుకు చాలా కాలంగా వరదలు వస్తున్నాయి. 2013లో పెరియార్ నదిపైనున్న ఇదమలేయర్ డ్యామ్ గేట్లు తెరచినప్పుడు కూడా ఈ కాల్వకు వరదలు వచ్చాయి. అప్పుడు కూడా కోచి విమానాశ్రయాన్ని రెండు రోజులపాటు మూసివేశారు. దేశంలో నదుల పక్కన, కాల్వల పక్కన విమానాశ్రయాలు నిర్మించడం ఒక్క కేరళలోనే జరగలేదు.
చెన్నై, ముంబై ఎయిర్‌పోర్టులు అంతే.......
తమిళనాడులోని చైన్నై విమానాశ్రయానికి 2011లో రెండో రన్‌వేను నిర్మించినప్పుడు సమీపంలోని అడయార్ నదిపై వంతెనను నిర్మించారు. ఫలితంగా 2015లో వరదలు వచ్చినప్పుడు విమానాశ్రయం మునిగిపోవడంతో కొన్ని రోజులు దాన్ని మూసివేశారు. ఢిల్లీ తర్వాత అత్యంత ప్రయాణికుల తాకిడి ఉండే ముంబై రన్‌వేను కూడా నదిని ఆక్రమించి కట్టిందే. మొదటి రన్‌వేను మితీ నది కల్వర్ట్‌పై 2005లో నిర్మించగా, రెండో రన్‌వేను నేరుగా నదిలోకే కట్టారు.
2005లోనే మితీ నది నుంచి రన్‌వేపైకి వరదలు వచ్చినప్పటికీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం రెండో రన్‌వేను నేరుగా నదిపైకే నిర్మించింది. అప్పటికే కాదు, ఇప్పటికీ పాలకులు కళ్లు తెరవడం లేదు. నవీ ముంబైలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడం కోసం ఉల్వే నదిని మళ్లించాలని నిర్ణయించారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఎయిర్ లైన్స్ కన్సల్టెంట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని, బడా పెట్టుబడిదారులతోని పాలకులు లాలూచి పడడం వల్ల ప్రకృతికి విరుద్ధంగా ప్రాజెక్టులు వస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment