
హైకోర్టు జడ్జికే లంచం!
కొచ్చి: ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికినా.. అన్నట్టుగా అవినీతి సర్వత్రా వ్యాపించింది. లంచాలు ఇవ్వడం, తీసుకోవడం సర్వసాధారణ విషయంగా మారింది. ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే లంచం ఇవ్వచూపారంటే ఈ జాడ్యం ఎంత ముదిరిపోయిందో అర్థమవుతోంది.
స్మగ్లింగ్ కేసులో తనకు ముడుపులు ఇవ్వచూపారని కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కేటీ శంకరన్ వెల్లడించారు. తనకు అనుకూలంగా తీర్పు ఇస్తే రూ. 25 లక్షలు లంచం ఇస్తామని ఆశ చూపారని చెప్పారు. 500 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో ఇమ్మిగ్రేషన్ అధికారితో సహా నిందితులను గతేడాది అక్టోబర్ లో అరెస్ట్ చేశారు.
ఈ కేసు నుంచి తమను బయటపడేసేందుకు అంగీకరిస్తే తీర్పుకు ముందు రూ. 25 లక్షలు, తర్వాత మరికొంత మొత్తం ముట్టచెబుతామని నిందితులు ఆశ పెట్టారని శంకరన్ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ నుంచి వైదొలిగానని చెప్పారు. 61 ఏళ్ల శంకరన్ కేరళ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల్లో ఒకరు. 2005లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.