న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లవ్ జిహాద్ కేసు సుప్రీంకోర్టులో కొత్తమలుపు తిరిగింది. కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా కేసు విచారణ ఇవాళ ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. అసలు హదియ వాంగ్మూలం సేకరించవద్దని ఎన్‌ఐఏ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హదియను హిప్నటైజ్ చేశారని, ఆమె మాటలు నమ్మవద్దని ఎన్‌ఐఏ వాదించగా, ఆ వాదనలను హదియ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హదియ కేసు ఓ అసాధారణమైనదని, హదియా వాంగ్మూలంపై ఇప్పుడికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని పేర్కొంది. విచారణకు హాజరైన హదియను ...ఉన్నత న్యాయస్థానం మీకేం కావాలని ప్రశ్నించగా... తనకు స్వేచ్ఛ కావాలని సమాధానం చెప్పింది. అంతేకాకుండా మెడిసన్ పూర్తి చేసి, డాక్టర్‌ను కావాలంటూ ఆమె కోర్టుకు విన్నవించింది. దీంతో ఆమె తన చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు సేలంలోని హోమియోపతి కళాశాల డీన్‌ను గార్డియన్ గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కాగా హదియ గతేడాది డిసెంబర్‌లో మతమార్పిడి చేసుకుని ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవటం.. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. గతంలో హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేస్తే... ఆమె భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment