Hadiya
-
బీజేపీలో చేరిన హదియా తండ్రి
తిరువనంతపురం : ఇస్లాం మతం స్వీకరించి.. ఆ తర్వాత ముస్లిం యువకుడిని వివాహం చేసుకుని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని హదియా తండ్రి కేఎమ్ అశోకన్ సోమవారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యదర్శి బి.గోపాలకృష్ణన్ సమక్షంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అశోకన్ మీడియాతో మాట్లాడారు. ‘ చిన్ననాటి నుంచి నేను కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను నమ్ముతున్నాను. కానీ ఇటీవలి కాలంలో మైనార్టీ ఓట్ల కోసం ఆ పార్టీ దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి హిందువుల గురించి మాట్లాడుతున్నాడు అంటే అతడిని ఎందుకు ఓ తీవ్రవాదిగా ముద్ర వేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు. నమ్మకానికి, చట్టానికి మధ్య నలిగిపోతున్నాం.. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరు హిందువుల్లాగే తాను కూడా చట్టానికి, నమ్మకానికి మధ్య నలిగిపోతున్నాని అశోకన్ అన్నారు. నిజానికి మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలను చట్టం పరిధి నుంచి తప్పిస్తేనే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.. అయితే శబరిమల అంశంలో బీజేపీ అనుసరించే ఏ విధానాలనైనా తాను సమర్థిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంపై మేధావులు కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాగా కేరళకు చెందిన అఖిల ఆశోకన్(25) అనే యువతి 2016 డిసెంబర్లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అఖిల తండ్రి అశోకన్ మాత్రం తన కూతురుని బలవంతంగా మతం మార్పించి, షఫీన్ పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై కేరళ హైకోర్టు వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పునివ్వడంతో హదియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో హదియా- షఫీన్ల వివాహం చట్టబద్ధమైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. -
సుప్రీం తీర్పు అనంతరం స్పందించిన హదియా
కేరళ: ఇస్లాం మతం స్వీకరించడం వల్లనే ఎన్నో అవమానాలను, సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చిందని 'లవ్ జీహాద్' తీర్పు అనంతరం హదియా తెలిపారు. వారి వివాహం చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం తొలిసారి భర్త షఫిన్ జహాన్‌తో కలిసి ఆమె కేరళ వెళ్లారు. హదియా కేసులో న్యాయపరంగా ఎంతో కీలక పాత్ర పోషించిన 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' నాయకులను మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. ఇస్లామిక్ సంస్థ ముఖ్య నేత సైనాబాను కోజికోడ్‌లో కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హాదియా మత మార్పిడిలో సైనాబానే కీలక పాత్ర వహించింది. ఈ సందర్భంగా సైనాబా స్పందిస్తూ సుప్రీంకోర్టు హదియా, జహాన్‌ల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడం తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. తమ కూతుర్ని బలవంతంగా మత మార్పిడి చేసి, ఇస్లాం స్వీకరించేలా ప్రోత్సహించి వివాహం చేసుకున్నారని హదియా తండ్రి కేరళ హైకోర్టును ఆశ్రయించగా తొలుత ఈ కేసును విచారించిన హైకోర్టు వారి విహహాం చెల్లదని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ కోర్టును సుప్రీంకోర్టులో హదియా దంపతులు సవాల్ చేయగా రెండేళ్ల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. -
లవ్ జిహాద్ కేసు.. కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్ జిహాదీ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హదియా వివాహాన్ని రద్దు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ గురువారం తీర్పు వెలువరించింది. తన భర్తతో జీవించే హక్కు హదియాకు ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో తిరువనంతపురం హైకోర్టు హదియా విహాహం చెల్లదంటూ తీర్పునివ్వగా.. దానిని సవాల్ చేస్తూ ఆమె భర్త షఫీన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నేడు కీలక ఆదేశాలు వెలువరిస్తూ ‘ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం దిగువ న్యాయస్థానానికి లేదు’ అని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతం కాదని.. వారి వివాహం వారి ఇష్టప్రకారం జరిగిందేనని బెంచ్ పేర్కొంది. అంతేకాదు భర్త షఫీన్ తో జీవించేందుకు ఆమెకు స్వేచ్ఛ ఉందంటూ కోర్టు తెలిపింది. అదే సమయంలోజాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను కేవలం ఉగ్ర కోణంలో మాత్రమే దర్యాప్తు కొనసాగించాలని, వైవాహిక జీవితంలో జోక్యం చేసుకూడదని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా, కేరళకు చెందిన అఖిల ఆశోకన్(25) అనే యువతి 2016 డిసెంబర్లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్ జహాన్‌ను వివాహం చేసుకుంది. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై కేరళ హైకోర్టు వివాహాన్ని రద్దు చేయటం.. కేసు ఎన్ఐఏ కు దర్యాప్తునకు అప్పగించటం తెలిసిందే. -
లవ్ జిహాదీ కేసు:‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ లవ్ జిహాద్ కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హదియా ఎవరితో జీవించాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మంగళవారం ఈ కేసు విచారణను కొనసాగించిన ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ‘‘మీరు(ఎన్ఐఏను ఉద్దేశించి) ఏమైనా దర్యాప్తు చేసుకోవచ్చు. కానీ, హదియా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే న్యాయ బద్ధత మాత్రం లేదు. మేజర్ అయిన ఓ అమ్మాయిని తల్లిదండ్రులతో ఉండాలని చెప్పటానికి ఎవరికీ హక్కులు లేవు. ఎవరితో జీవించాలన్న నిర్ణయం కూడా పూర్తిగా ఆమెకు మాత్రమే ఉంటుంది. పైగా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు న్యాయస్థానాలకు కూడా ఉండదు’’ అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు కోర్టు వాయిదా వేసింది. కాగా, కేరళకు చెందిన అఖిల ఆశోకన్(25) అనే యువతి గతేడాది డిసెంబర్లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్ జహాన్‌ను వివాహం చేసుకుంది. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇక హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేయటంతో ఆమె భర్త షఫీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కేసు విచారణ కొనసాగుతోంది. -
ఎట్టకేలకు భర్తను కలిసింది..
సాక్షి, తిరువనంతపురం : దాదాపు ఏడాది కాలం వారిద్దరి మధ్య విరామం. భార్య భర్తలైనప్పటికీ లవ్ జిహాద్ వివాదం వల్ల దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ డిసెంబర్ 3న వారిద్దరు ఓ కాలేజీలో సీసీటీవీ కెమెరాల మధ్య కలిసేలా అవకాశం కల్పించారు. ఆ సమయంలో వారిద్దరు పొందిన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరో కాదు.. కేరళకు చెందిన హదియా (24), షఫీన్ జహాన్‌లు. వాస్తవానికి హదియా ముందు ఓ హిందువు. ఆమె పేరు అఖిల.. ఓ కాలేజీలో హోమియోపతి విభాగంలో విద్యనభ్యసిస్తున్న ఆమెను ఇంట్లో ఓ పండుగకు ఆహ్వానించగా అందులో పాల్గొనేందుకు నిరాకరించింది. దాంతో ఆమె తండ్రి అశోకన్ కేఎం వివరాలు తెలుసుకోగా షాకింగ్ అంశాలు తెలిశాయి. ఆ అఖిల ఇప్పుడు నాటి అఖిల కాదని హదియాగా మారిందని, ముస్లిం మతంలోకి మారి వివాహం కూడా చేసుకుందని తెలిసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ చేసిన కుట్రలో భాగంగా తన కూతురుని బలవంతంగా మతం మార్పించారని, ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రేరేపించారని, అందుకే తనను హదియా మార్చారని వివరించారు. వారి పెళ్లిని కూడా రద్దు చేయాలని అందులో కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు ఈ వ్యవహారంపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. దీంతో హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆమె తిరిగి తన విద్యను కొనసాగించేందుకు అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా ఆమెకు సంరక్షకుడిగా ఓ డీన్ కూడా పెట్టింది. ఎవరు ఎలాంటి సమస్యను ఆమెకు సృష్టించాలని చూసినా అతడే చర్యలు తీసుకునేలా అవకాశం కల్పించింది. అయితే, వారి వివాహం విషయంలో పిటిషన్ మాత్రం జనవరి నెలలో విచారిస్తామని తెలిపింది. -
హిందూ పేరుతోనే.. ‘హదియా’ చదువు
సాక్షి, సేలం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్ జీహాద్ వ్యవహారంలో యువతి హదియా.. హిందూపేరుతోనే వైద్య విద్యను పూర్తి చేయనున్నట్లు సేలమ్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని కాలేజ్ ప్రిన్సిపాల్ జీ. కన్నన్ స్పష్టం చేశారు. హదియాగా పేరు, మతం మార్చుకున్నా.. కాలేజ్ రికార్డుల్లో మాత్రం అఖిలా అశోకన్గానే గుర్తిస్తామని ఆయన తెలిపారు. హదియాను ఆమె తల్లిదండ్రులు మాత్రమే కలిసేందుకు అవకాశం ఉందని.. ఇతరులు ఎవరూ ఆమెను కలవకూడదని ఆయన స్పష్టం చేశారు. హదియా బుధవారం నుంచి తరగతులకు హాజరవుతుందని ప్రిన్సిపాల్ కన్నన్ తెలిపారు. సుప్రీంకోర్టు సూచలన మేరకు హదియా.. తన వైద్య విద్యను కొనసాగించేందుకు కేరళ పోలీసు భద్రత మధ్య సేలం చేరుకున్నారు. కాలేజీకి చేరుకున్న హదియా.. ఉన్నతాధికారులను కలిశారు. కాలేజ్ పరిసరాల్లో భర్త షఫీన్ జహాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కోరారు. అఖిలా అశోకన్.. సేలంలోని వైద్య కళాశాలలో వైద్య విద్య చదువుతోంది. నాలుగున్నరేళ్లు చదివిన అనంతరం పరిచయమైన షబ్బీన్ జహాన్నే అనే ముస్లింను పెళ్లిచేసుకుని పేరును, మతాన్నిమార్చుకుంది. అఖిళా అశోకన్.. హదియాగా మతం మార్చుకోవడం వెనకు కుట్ర ఉందని ఆమె తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. ఈ వివాహం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ.. హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆమె విద్యను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని ఎన్ఐఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హదియా తండ్రి.. అశోకన్ హర్షం వ్యక్తం చేశారు. తమ కటుంబంలోకి ఒక ఉగ్రవాదిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని ఆయన తెలిపారు. -
సేలం చేరుకున్న హదియా
సేలం: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లవ్ జిహాద్ వ్యవహారంలో యువతి హదియా సుప్రీంకోర్టు సూచన మేరకు తన వైద్యవిద్య కొనసాగించేందుకు మంగ ళవారం సేలం చేరుకున్నారు. వివరాలు.. కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అఖిలఅశోకన్. ఈమె సేలంలోని సిద్ధక్ కోవిల్ ప్రాంతంలో హోమియోపతి వైద్య కళాశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఈ క్రమంలో నాలుగున్నరేళ్లు చదువుకున్న అనంతరం కేరళకు వెళ్లిన అఖిల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయలేదు. కేరళకు వెళ్లిన ఆమె అక్కడ షబ్బిన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అంతేకాకుండా మతం మారి తన పేరును హదియాగా మార్చుకుంది. తన కుమార్తెకు మాయమాటలు చెప్పి, మతం మార్చి వివాహం చేసుకున్నారని ఆమె తండ్రి కేరళ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఆమె వివాహం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన సుప్రీం కోర్టు ఆమె చదువును కొనసాగించాలని సూచించింది. దీంతో హదియా మంగళవారం సాయంత్రం సేలం కళాశాలకు చేరుకుంది. -
తమిళనాడుకు హదియా
న్యూఢిల్లీ: ఇస్లాం మతం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన కేరళ యువతి హదియాను సుప్రీంకోర్టు తమిళనాడులోని సేలం జిల్లాకు పంపింది. ఆమె తన హోమియోపతి చదువును పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ‘లవ్‌జిహాద్’ కేసుకు సంబంధించి సోమవారం హదియా కోర్టుకు హాజరైంది. తన భర్త షఫీన్ జహాన్‌తోనే ఉంటానని కోర్టుకు హదియా స్పష్టం చేసింది. హదియా, జహాన్‌ల పెళ్లిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించిన కేరళ హైకోర్టు.. వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులను సవాలు చేస్తూ జహాన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. హదియా చదువుతున్న కాలేజీ డీన్‌ను ఆమెకు సంరక్షకుడిగా నియమించిన అత్యున్నత ధర్మాసనం.. ఏదైనా సమస్య ఎదురైతే తమను సంప్రదించే స్వేచ్ఛను డీన్‌కు ఇచ్చింది. హదియాకు మళ్లీ అడ్మిషన్ ఇవ్వాలని, హాస్టల్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత కాలేజీ, వర్సిటీని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌ల బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. భార్య చరాస్తి కాదు.. హదియా చదువు, అలవాట్లు, ఆమె జీవితాశయం గురించి ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సేలంలో తన సంరక్షకుడిగా ఉండేందుకు ఎవరైనా బంధువులు లేదా పరిచయస్తుల పేర్లు తెలపాల్సిందిగా ధర్మాసనం కోరగా.. తన భర్త షఫీన్ సంరక్షకుడిగా ఉంటారని ఆమె జవాబిచ్చింది. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఓ భర్త తన భార్యకు సంరక్షకుడిగా ఉండలేడు. భార్య చరాస్తి కాదు. ఆమెకు వ్యక్తిగత గుర్తింపు, జీవితం ఉంటాయి. నేను కూడా నా భార్యకు సంరక్షకుడిని కాదు’ అని వ్యాఖ్యానించారు. -
కొత్త మలుపు తిరిగిన లవ్ జిహాద్ కేసు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లవ్ జిహాద్ కేసు సుప్రీంకోర్టులో కొత్తమలుపు తిరిగింది. కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా కేసు విచారణ ఇవాళ ఉన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. అసలు హదియ వాంగ్మూలం సేకరించవద్దని ఎన్ఐఏ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హదియను హిప్నటైజ్ చేశారని, ఆమె మాటలు నమ్మవద్దని ఎన్ఐఏ వాదించగా, ఆ వాదనలను హదియ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హదియ కేసు ఓ అసాధారణమైనదని, హదియా వాంగ్మూలంపై ఇప్పుడికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని పేర్కొంది. విచారణకు హాజరైన హదియను ...ఉన్నత న్యాయస్థానం మీకేం కావాలని ప్రశ్నించగా... తనకు స్వేచ్ఛ కావాలని సమాధానం చెప్పింది. అంతేకాకుండా మెడిసన్ పూర్తి చేసి, డాక్టర్‌ను కావాలంటూ ఆమె కోర్టుకు విన్నవించింది. దీంతో ఆమె తన చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు సేలంలోని హోమియోపతి కళాశాల డీన్‌ను గార్డియన్ గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా హదియ గతేడాది డిసెంబర్లో మతమార్పిడి చేసుకుని ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవటం.. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. గతంలో హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేస్తే... ఆమె భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
నేను నా భర్తతోనే ఉంటా: హదియా
కొట్టాయం: కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్ అలియాస్ హదియా(25) తాను తన భర్తతోనే కలిసి ఉంటానని స్పష్టం చేశారు. ‘లవ్ జిహాద్’ కేసుగా పేరుగాంచిన ఈ వ్యవహారంలో నవంబర్ 27న ఆమె సుప్రీంకోర్టు ముందు హాజరుకానుంది. ‘నేను ముస్లింను. నన్ను ఇస్లాంలోకి మారాలని ఎవ్వరూ బలవంతపెట్టలేదు. నా భర్త జహాన్‌తోనే ఉండాలనుకుంటున్నాను’ అని కోచి విమానాశ్రయంలో అరుస్తూ విలేకరులతో చెప్పింది. వెంటనే హదియాను ఆమె తల్లిదండ్రులు, పోలీసులు బలవంతంగా విమానాశ్రయం లోపలికి తీసుకెళ్లిపోయారు. -
‘ఆమెతో నో ప్రాబ్లమ్.. కానీ అల్లుడే’
తిరువనంతపురం: తన కూతురు ఏ మతంలోకి మారిపోయినా తనకు ఇబ్బంది లేదని లవ్ జిహాద్ కేసుతో సంచలనం సృష్టించిన హదియా/అఖిల తండ్రి అశోకన్ కేఎం అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తన కుమార్తెను న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తానని చెప్పారు. హదియాను గృహనిర్బంధం చేసినట్టు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ‘నవంబర్ 27న ఆమెను కోర్టులో హాజరుపరుస్తా. ఆమె ఏ మతంలోకి మారినా నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ షఫిన్ జహాన్‌ను మాత్రం అంగీకరించం(హదియా భర్త). ఆమె పోరాటాన్ని ఎవరు అడ్డుకోవడం లేదు. ఆమె గృహనిర్బంధంలో లేదు. పోలీసు అధికారులు చుట్టూ ఉండటంతో ఆమె తనకు తానుగా బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. మొదటి నుంచి నామీద, మా కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నార’ని అశోకన్ వాపోయారు. హదియాను తమ ఎదుట ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల షఫిన్ జహాన్ అమిత సంతోషం వ్యక్తం చేశాడు. ఆమె చెప్పేది విన్నతర్వాత అంతా తమకు అనుకూలంగా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాలను కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏంసీ జొసెప్పైన్ స్వాగతించారు. తాము కోరుకున్నట్టుగా హాదియా అభిప్రాయాన్ని న్యాయస్థానం వినబోతోందని, ఆమెకు ఎటువంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కేరళకు చెందిన 24 ఏళ్ల అఖిల అశోకన్‌ను ఇస్లాం మతంలోకి మారి షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ‘లవ్ జిహాద్’గా భావించిన హైకోర్టు వీరి వివాహాన్ని రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షఫిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హదియాను స్వచ్ఛందంగా మతమార్పిడి చేసుకుందా, లేదా తెలుసుకునేందుకు నవంబర్ 27న ఆమెను తమ ఎదుట హాజరుపరచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. -
సామాన్యులు చేస్తే తప్పా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘లవ్ జిహాదీ’ పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన 24 ఏళ్ల అఖిల అశోకన్ అలియాస్ హదియా పెళ్లి కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికరమైన చర్చ, వాదోపవాదాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షా నవాజ్ హుస్సేన్‌లు హిందూ మహిళలను వివాహం చేసుకొని వారి మతాన్ని మార్చవచ్చుగానీ ఓ సామాన్య హిందూ మహిళైన అఖిల మతం మారి పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అని ఆమెను పెళ్లి చేసుకున్న షఫీన్ జహాన్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇష్టపూర్వకంగా మతం మారి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం యువకుడైన జహాన్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆమె పెళ్లిని రద్దు చేయడమే కాకుండా లవ్ జిహాదీ కేసంటూ వేధింపులకు గురిచేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రముఖులు పెళ్లి చేసుకుంటే తప్పులేదుగానీ, సామాన్యుల పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అలాంటప్పుడు అబ్బాస్ నఖ్వీ, షా నవాజ్ హుస్సేన్‌లను కూడా లవ్ జిహాదీ కింద ఎందుకు విచారించరని న్యాయవాది ఆవేశంగా సంవాదం చేయడం కొత్త చర్చకు దారితీసింది. భారతీయ జనతా పార్టీలో వీరిద్దరే కాకుండా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సికందర్ భక్త్ కూడా హిందూ మహిళనే పెళ్లి చేసుకున్నారు. వీరి భార్యలు కూడా ఇస్లాం మతం స్వీకరించారు. ఒక్క బీజేపీనే కాదు, మతాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆరెస్సెస్, వీహెచ్‌పీ, శివసేన నాయకుల ఇళ్లలోనే మతాంతర వివాహాలు దివ్యంగా జరిగాయి. శివసేన దివంగత చీఫ్ బాల్ ఠాక్రే మనమరాలు ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కూతురు కూడా ముస్లిం యువకుడినే పెళ్లి చేసుకొంది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూతురు ముస్లిం యువకుడిని, బీజేపీ నేత సుబ్రమణియం స్వామి కూతురు సుహాసినీ కూడా ముస్లింనే పెళ్లి చేసుకొంది. పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మేన కోడలు కూడా ముస్లింను పెళ్లి చేసుకుంది. ఇక ప్రముఖుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ మాజీ భార్య సంగీత బిజిలానీ అనే విషయం అందరికి తెల్సిందే. బాలివుడ్ హీరో షారూక్ ఖాన్, గౌరీని, నవాబ్ అలీఖాన్ పటోడి, షర్మిలా ఠాకూర్‌ను, అర్బాజ్ ఖాన్, మల్లికా అరోరాను, షైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నారని, వారంతా హిందూ మహిళలేనన్న విషయం తెల్సిందే. ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీణు, రెండో భార్య కిరన్ రావులు కూడా హిందువులే. అఖిల అలియాస్ హదియా కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా కీలకమైన న్యాయ అంశాలను లేవనెత్తారు. మైనారిటీ తీరిపోయిన అఖిల తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దాన్ని రద్దు చేసే హక్కు ఓ హైకోర్టుకు రాజ్యాంగంలోని 226 కింద ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న ఈ అధికరణం కింద పెళ్లిని రద్దు చేయడం అంటే ఆ హక్కునే ఉల్లంఘించినట్లు కాదా? అని ప్రశ్నించారు. అఖిల పెళ్లిని రద్దు చేయడంపై పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ పెళ్లి చెల్లుతుందా, లేదా అన్న అంశానికే పరిమితం కావాల్సిన సుప్రీం కోర్టు బెంచీ ఆమెకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయో, లేవో తేల్చాల్సిందిగా 136 అధికరణం కింద సంక్రమించిన అధికారాల మేరకు ఎన్ఐఏను ఆదేశించడం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడే ఉన్న సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్‌ను పిలిచి ప్రశ్నించారు. ఓ కేసులో సంపూర్ణ న్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు 136 అధికరణం కింద కాకుండా 142 అధికరణం కింద ఇలాంటి అదేశాలను సుప్రీం కోర్టు జారీ చేయవచ్చని నారిమన్ వివరించారు. పైగా పెళ్లిని రద్దు చేసినప్పటి నుంచి తండ్రి ఇంట్లో కూతురును నిర్బంధించి ఉంచడం, అందులో పోలీసుల కాపలా పెట్టడం ఏమిటని కూడా మిశ్రా ప్రశ్నించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. హోమియోపతి డిగ్రీ చదివిన అఖిల 2016 మొదట్లోనే ఇస్లాం కోర్సు పాసై మతం మార్చుకున్నారు. అదే సంవత్సరం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా సంబంధాలు వెతక్కొని 2016, డిసెంబర్ నెలలో ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ముస్లిం సంఘాల ప్రోద్బలంతో అఖిల పెళ్లి చేసుకున్నారంటూ, ఇది లవ్ జీహాదీయేనంటూ ఆమె తండ్రి అశోక్ హైకోర్టును ఆశ్రయించడంతో 2017, మే 24వ తేదీన కేరళ హైకోర్టు ఆమె పెళ్లిని రద్దు చేసింది. ఆమెను తండ్రి సంరక్షణలో ఉండాల్సిందిగా ఆదేశించింది. కేరళలోని కొట్టాయం జిల్లా, టీవీ పురంలోని తన తండ్రి ఇంట్లో అఖిల నిర్బంధంగా ఉంటున్నారు. ఆమె భర్త షఫీన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణ కొనసాగుతోంది. -
ఆమెకు ఆరుగురు పోలీసుల కాపలా
సాక్షి, తిరువనంతపురం: అది కేరళలోని కొట్టాయం జిల్లా, తిరుమణి వెంకటపురం (టీవీ పురం అని పిలుస్తారు) గ్రామంలోని ఓ ఇల్లు. ఇంటి వెలుపల ఎప్పుడూ ఆరుగురు సాయుధ పోలీసులు, షిప్టుల పద్ధతిలో 24 గంటలపాటు కాపలా ఉంటారు. ఆ ఇంటి పరిసరాల దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వరు. ముఖ్యంగా జర్నలిస్టులను అసలే రానివ్వరు. ఇంటినిగానీ, ఇంటి పరిసరాలనుగాని కనీసం ఫొటోలు కూడా తీయనివ్వరు. ఆ ఇంటికి సంబంధించిన బంధువులొస్తే వచ్చేటప్పుడు, పోయేటప్పుడు వారిని తనిఖీ చేస్తారు. అలా అని అది పెద్ద రాజకీయ నాయకుడి ఇల్లు కాదు, సెలబ్రిటీ ఇల్లు అంతకన్నా కాదు. టెర్రరిస్టు ఇల్లు అసలే కాదు. అది సీఆర్పీఎఫ్లో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన అశోకన్ మణి అనే వ్యక్తి ఇల్లు. అందులో ఆయన భార్య పొన్నమ్మ, వారి 24 ఏళ్ల కూతురు అఖిల అశోకన్ ఉంటున్నారు. వారి ముగ్గురి కోసం ఆ ఇంటికి అంత భద్రత ఎందుకో తెలసుకోవాలంటే కాలక్రమంలో వెనక్కి వెళ్లి రావాలి. అఖిల స్థానికంగా తన హైస్కూలు, ఇంటర్ చదువు ముగించుకొని తన 18వ ఏట, అంటే 2011లో ఊరు నుంచి పై చదువుల కోసం 400 కిలోమీటర్ల దూరంలోవున్న తమిళనాడులోని సేలంకు వెళ్లారు. అక్కడి శివరాజ్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ‘బ్యాచ్లర్స్ ఇన్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ (బీహెచ్ఎంఎస్)లో చేరారు. అక్కడి కళాశాల హాస్టలో ఆమెకు ఫుడ్ నచ్చ లేదు. చదువు మీద కూడా పెద్దగా శ్రద్ధ పెట్టలేదు, దాంతో మొదటి సంవత్సరంలో ఒకసారి, ఆఖరి సంవత్సరంలో ఒకసారి ఫెయిలయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ. కన్నన్ తెలిపారు. అఖిల మొదటి సంవత్సరం పూర్తికాగానే నలుగురు క్లాస్‌మేట్స్‌తో కలసి బయట రూమ్ తీకున్నారు. వారిలో ఇద్దరు హిందువులు కాగా, జసీనా సహా మరో ఇద్దరు ముస్లిం యువతులు ఉన్నారు. 2015, నవంబర్ తన తాతగారు చనిపోవడంతో అఖిల సొంతూరు టీవీ పురంకు వచ్చారు. తాత కర్మకాండలో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. అనవసర తతంగమంటూ విసుక్కున్నారు. ఎప్పుడు గుడులు చుట్టూ తిరిగే తల్లి పొన్నమ్మ వెంట ఒక్క గుడికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. కూతురులో వస్తున్న ఈ మార్పేమిటో తల్లిదండ్రులు గ్రహించేలోగానే అఖిల చదువు కోసం సేలం వెళ్లిపోయారు. తన రూమ్మేట్ జసీనా, ఆమె చెల్లెలు ఫసీనాతో అఖిలకు మంచి స్నేహం ఏర్పడింది. 2016, జనవరి 2వ తేదీన అఖిల మల్లపురం జిల్లాలోని పెరింథాలమన్న గ్రామంలోని జసీనా, ఫసీనాల ఇంటికి వెళ్లింది. వేళకు ప్రార్థనలు చేయడం లాంటి ముస్లిం సంప్రదాయం తనకు నచ్చిందని, తాను ముస్లిం మతం స్వీకరిస్తానని స్నేహితురాళ్లకు చెప్పింది.ఈ విషయాన్ని అఖిల స్నేహితురాళ్లు వారి తండ్రి అబూబ్యాకర్ దష్టికి తీసుకెళ్లారు. ముందుగా చదువు పూర్తి చేసుకున్నాక మతం మారవచ్చని, అంతవరకు ఓపిక పట్టుమని అఖిలకు నచ్చ చెప్పేందుకు అబూబ్యాకర్ ప్రయత్నించారు. అందుకు అంగీకరించకపోవడంతో ఆయన అఖిలను కోజికోడ్‌లోని ‘తెరబియ్యాతల్ ఇస్లామ్ స్కూల్ ’కు తీసుకెళ్లారు. ఇస్లామ్ మతంలో చేరాలంటే ఎవరి ప్రభావం లేకుండా స్వచ్ఛందంగా చేరుతున్నానంటూ నోటరీ నుంచి అఫిడ్‌విట్ తీసుకరావాలని, ఇస్లామ్ మతంలో 60 రోజుల కోర్సు చేసి పాసవ్వాలని సభ ప్రిన్సిపాల్ ఉమర్ ఫాయిజీ చెప్పారు. ఖురాన్‌లోని కొన్ని సురాలు (మొత్తం 114 సురాలు ఉంటాయి), అంటే కొన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. తల్లిదండ్రులను వెంట తీసుకు రానందున సభలో ఉండి చదువుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. బయట ఉండి కోర్సు చేయడానికి అంగీకరించారు. కేరళ ప్రభుత్వం మత మార్పిడి సర్టిఫికెట్లను గుర్తించే సంస్థల్లో ఈ సభ ఒకటి. దాంతో ఆబూబ్యాకర్ను అఖిలను 2016, జనవరి 5వ తేదీన మల్లప్పురం జిల్లా, మంజేరిలోని మర్కాజుల్ ఇదయా సత్య శరాణి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా అఫిడవిట్ లేనందున అఖిలను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఇంతకుమించి తాను సహాయం చేయలేనని, సేలం వెళ్లాల్సిందిగా ఆమెను అబూబ్యాకర్ కోరారు. ఆమె అలాగేనని చెప్పి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈలోగా తన కూతురు సేలంలో లేదని తెలుసుకున్న అశోకన్ జనవరి 7వ తేదీన పెరింథాలమన్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసును దాఖలు చేశారు. జనవరి 14వ తేదీన కేరళ హైకోర్టుకు వెళ్లి ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈలోగా మిస్సింగ్ కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు కేరళ పోలీసు చట్టంలోని 57 చట్టం కింద అబూబ్యాకర్ను అరెస్ట్ చేసి విచారించారు. రెండు రోజుల నిర్బంధం అనంతరం ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. 2016, జనవరి 19వ తేదీన అఖిల కేరళ హైకోర్టుకు హాజరై తాను ఎక్కడికి తప్పిపోలేదని, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ఇష్టపూర్వకంగానే మర్కాజుల్ ఇదయా సత్య శరాణి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్‌లో చదువుకుంటున్నానని చెప్పారు. సేలం వెళ్లిపోతానని అబూబ్యాకర్కు చెప్పిన అఖిల వెళ్లిపోకుండా అఫిడవిట్ తీసుకొని తిరిగి మర్కాజుల్ ఇదయాకు మళ్లీ వెళ్లారు. పెద్ద వాళ్ల ప్రమేయం లేకుండా తాము చేర్చుకోమని అప్పుడు కూడా ట్రస్ట్ మేనేజర్ మొహమ్మద్ రఫీ చెప్పారట. ఇస్లాంలో కోర్సు చేయాలన్న ఆసక్తి తనకు ఎంతో ఉందని చెప్పడంతో ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’కు అనుబంధంగా నడుస్తున్న జాతీయ మహిళా సంఘటన జాతీయ అధ్యక్షులైన సాయినాభను కలవాల్సిందిగా ఆయన సూచించారట. ఆ సూచన మేరకు అఖిల ఆమెను కలసుకొని తన కథంతా చెప్పి ఆమెతో ఉండిపోయారు. తండ్రి కోర్టులో అఫిడవిట్ వేసిన విషయం తెలుసుకొని అఖిల సాయినాభను తీసుకొని హైకోర్టుకు వచ్చారు. కేరళలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డులోని ఏకైక మహిళా సభ్యురాలు సాయినాభ హైకోర్టు అఖిల తండ్రి అశోకన్ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌ను జనవరి 25వ తేదీన కొట్టివేయడంతో అఖిల తిరిగి సాయినాభతో కలసి ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ శరాణి ట్రస్ట్ షరతుపై సేలం వెళ్లి హోమియోపతి ఫైనల్ ఇయర్లో మిగిలిపోయిన సబ్జెక్టులను పూర్తి చేసి, తిరిగి ట్రస్ట్‌కు చేరుకొని అక్కడి 50 రోజుల ఇస్లాం కోర్సు చేసి పాసయ్యారు. తన పేరును హిదయాగా మార్చుకుని ఇస్లాం సర్టిఫికెట్ తీసుకున్నారు. అనంతరం ముస్లింల పెళ్లిళ్ల వెబ్సైట్ ‘వే టూ నిఖా డాట్ కామ్’లో తన పేరును నమోదు చేసుకున్నారు. 20 మంది ముస్లిం యువకుల నుంచి అమెకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే హదియా హిందూ మతాన్ని మార్చుకోవడం వల్ల మున్ముందు గొడవలు రావచ్చనే భయంతో పెళ్లి చేసుకోవడానికి వారెవరూ ముందుకు రాలేదు. ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’కు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడైన షాఫిన్ జహాన్‌ను పెళ్లి చేసుకునేందుకు హదియాగా మారిన అఖిల నిర్ణయించుకున్నారు. ఈలోగా తన కూతురును సిరియాలో పోరాడేందుకు ఐఎస్ టెర్రరిస్టులు తీసుకెళ్లారని ఆరోపిస్తూ అఖిల తండ్రి అశోకన్ మరోసారి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హదియా మళ్లీ కోర్టుకు హాజరై తాను సిరియా వెళ్లేందుకు తన వద్ద పాస్‌పోర్టు కూడా లేదని, తాను ఎలా వెళతానని కోర్టుకు నివేదించారు. తాను ఇష్టపూర్వకంగా సాయినాభ దగ్గరే ఉంటున్నానని చెప్పారు. ఈసారి కోర్టు సాయినాభతో ఉండేందుకు అనుమతించలేదు. తల్లిదండ్రులతో ఉండాల్సిందిగా సూచించింది. అందుకు హదీనా అంగీకరించకపోవడంతో ఆమెను ఎర్నాకులంలోని లేడీస్ హాస్టల్ ఉంచి నిఘా ఉంచాల్సిందిగా కేరళ పోలీసులను కోర్టు ఆదేశించింది. తాను ఏ నేరం చేయనప్పటికీ తనను బలవంతంగా హాస్టల్లో ఉంచి, పోలీసు నిఘా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆమె సెప్టెంబర్ 29న హైకోర్టుకు లేఖ రాశారు. తిరిగి సాయినాభతో ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హదియా హోమియోపతి సబ్జెక్టులన్నీ పాసైనప్పటికీ హౌజ్‌సర్జన్ పూర్తి చేయలేదు. అందుకు తన తండ్రి తీసుకెళ్లిన తన సర్టిఫెకెట్లన్నింటినీ ఇప్పించాల్సిందిగా హదియా కోరుతూ 2016, అక్టోబర్ 24వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు అందుకున్న ఆమె సేలం వెళ్లి హౌజ్ సర్జన్లో చేరారు. 2016, డిసెంబర్ 19వ తేదీన ముస్లిం సంప్రదాయం ప్రకారం షాఫిన్ను నిఖా చేసుకున్నారు. ఆ పెళ్లిని కూడా తండ్రి వ్యతిరేకించడంతో డిసెంబర్ 21వ తేదీన హదియా తన భర్తతో కలసి కోర్టుకు హాజరయ్యారు. వారి పెళ్లి పట్ల హైకోర్టు కూడా అసంతప్తి వ్యక్తం చేసింది. హదియా కోర్టు వ్యవహారంతో తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఇస్లాం మతం స్వీకరించాకే తనకు పరిచయం అయ్యారని, పెళ్లికి ఆమె తండ్రిని కూడా ఆహ్వానించానని పెళ్లి కుమారుడు కోర్టుకు తెలిపారు. పెళ్లి కుమారుడి పూర్వపరాలను విచారించాల్సిందిగా స్థానిక డీజీపీని ఆదేశించిన కోర్టు హదియాను తిరిగి వుమెన్ హాస్టల్‌కు పంపించింది. షాఫిన్పై చదువుకునే రోజుల్లో ఓ క్రిమినల్ కేసు దాఖలైందని, గత అక్టోబర్‌లో ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన మాన్సి బురాఖితో పరిచయం ఉందని పోలీసులు నివేదిక ఇవ్వడంతో హైకోర్టు గత మే నెలలో షాఫిన్తో హదియాకు జరిగిన పెళ్లిని రద్దు చేసింది. అది కాలేజీలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన సాధారణ ఘర్షణ కేసని, ఇక బురాఖితో తనకు ఎలాంటి సంబంధం లేదని షాఫిన్ వాదించినా హైకోర్టు పట్టించుకోలేదు. హదియాను స్వగ్రామమైన టీవీ పురంలో తల్లిదండ్రులతో ఉండాల్సిందిగా ఆదేశిస్తూ పోలీసుల కాపలాను ఏర్పాటు చేసింది. హైకోర్టు తమ పెళ్లిని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆగస్టు 16వ తేదీన షాఫిన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హదియాగా మారిన అఖిల ఇంటి ముందు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కేసును కొన్ని పత్రికలు, కొన్ని సంస్థలు ‘లవ్ జిహాదీ’గా పేర్కొన్నాయి.హదియా మాత్రం తీవ్రవాదులతోగానీ, వారి సంస్థలతోగానీ తనకుగానీ, తన భర్తకుగాని ఎలాంటి సంబంధాలు లేవని చెబుతూ వస్తున్నారు. ఆమె తన చదువు, ఇస్లాం కోర్సు, మత మార్పిడి, పెళ్లి అన్నింటికి సంబంధించిన రుజువులను భద్రంగా దాచుకున్నారు. హదియాను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఎంత ప్రయత్నించినా కోర్టు నుంచిగానీ, పోలీసుల నుంచిగానీ అనుమతి లభించలేదు. శబరిమల సీనియర్ పూజారి మనవడు, సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ మాత్రం బుధవారం నాడు హదియాను, ఆమె తల్లి పొన్నమ్మను ఇంట్లోకి వెళ్లి కలసుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పుడు ఇళ్లంత నిశబ్దంగా ఉంది. తల్లీ కూతుళ్లు ఎవరూ కూడా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడలేదు. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోవడం లేదని తల్లి చెప్పగా, ముఖంపై నుంచి దుప్పట్టా వేసుకున్న హదియా తనను నమాజు కూడా చేసుకోనివ్వకుండా హింసిస్తున్నారని ఆరోపించింది. ‘ఇంకెంతకాలం నాకీ నిర్బంధం’ అన్న హదియా అడిగిన ప్రశ్నకు రాహుల్ వద్ద సమాధానం లేకపోవడంతో మౌనంగా బయటకు వచ్చారు.