సామాన్యులు చేస్తే తప్పా? | Kerala 'Love Jihad' case: Akhila's husband urges supreme court | Sakshi
Sakshi News home page

సామాన్యులు చేస్తే తప్పా?

Published Fri, Oct 6 2017 6:21 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Kerala 'Love Jihad' case: Akhila's husband urges supreme court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘లవ్‌ జిహాదీ’ పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన 24 ఏళ్ల అఖిల అశోకన్‌ అలియాస్‌ హదియా పెళ్లి కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికరమైన చర్చ, వాదోపవాదాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, షా నవాజ్‌ హుస్సేన్‌లు హిందూ మహిళలను వివాహం చేసుకొని వారి మతాన్ని మార్చవచ్చుగానీ ఓ సామాన్య హిందూ మహిళైన అఖిల మతం మారి పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అని ఆమెను పెళ్లి చేసుకున్న షఫీన్‌ జహాన్‌ తరఫు న్యాయవాది ప్రశ్నించారు.

ఇష్టపూర్వకంగా మతం మారి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం యువకుడైన జహాన్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆమె పెళ్లిని రద్దు చేయడమే కాకుండా లవ్‌ జిహాదీ కేసంటూ వేధింపులకు గురిచేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రముఖులు పెళ్లి చేసుకుంటే తప్పులేదుగానీ, సామాన్యుల పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అలాంటప్పుడు అబ్బాస్‌ నఖ్వీ, షా నవాజ్‌ హుస్సేన్‌లను కూడా లవ్‌ జిహాదీ కింద ఎందుకు విచారించరని న్యాయవాది ఆవేశంగా సంవాదం చేయడం కొత్త చర్చకు దారితీసింది.

భారతీయ జనతా పార్టీలో వీరిద్దరే కాకుండా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సికందర్‌ భక్త్‌ కూడా హిందూ మహిళనే పెళ్లి చేసుకున్నారు. వీరి భార్యలు కూడా ఇస్లాం మతం స్వీకరించారు. ఒక్క బీజేపీనే కాదు, మతాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆరెస్సెస్, వీహెచ్‌పీ, శివసేన నాయకుల ఇళ్లలోనే మతాంతర వివాహాలు దివ్యంగా జరిగాయి. శివసేన దివంగత చీఫ్‌ బాల్‌ ఠాక్రే మనమరాలు ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కూతురు కూడా ముస్లిం యువకుడినే పెళ్లి చేసుకొంది.

బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి కూతురు ముస్లిం యువకుడిని, బీజేపీ నేత సుబ్రమణియం స్వామి కూతురు సుహాసినీ కూడా ముస్లింనే పెళ్లి చేసుకొంది. పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ మేన కోడలు కూడా ముస్లింను పెళ్లి చేసుకుంది. ఇక ప్రముఖుల్లో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌ మాజీ భార్య సంగీత బిజిలానీ అనే విషయం అందరికి తెల్సిందే. బాలివుడ్‌ హీరో షారూక్‌ ఖాన్, గౌరీని, నవాబ్‌ అలీఖాన్‌ పటోడి, షర్మిలా ఠాకూర్‌ను, అర్బాజ్‌ ఖాన్, మల్లికా అరోరాను, షైఫ్‌ అలీ ఖాన్, అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నారని, వారంతా హిందూ మహిళలేనన్న విషయం తెల్సిందే. ఆమీర్‌ ఖాన్‌ మొదటి భార్య రీణు, రెండో భార్య కిరన్‌ రావులు కూడా హిందువులే.

అఖిల అలియాస్‌ హదియా కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా కూడా కీలకమైన న్యాయ అంశాలను లేవనెత్తారు. మైనారిటీ తీరిపోయిన అఖిల తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దాన్ని రద్దు చేసే హక్కు ఓ హైకోర్టుకు రాజ్యాంగంలోని 226 కింద ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న ఈ అధికరణం కింద పెళ్లిని రద్దు చేయడం అంటే ఆ హక్కునే ఉల్లంఘించినట్లు కాదా? అని ప్రశ్నించారు. అఖిల పెళ్లిని రద్దు చేయడంపై పిటిషనర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ పెళ్లి చెల్లుతుందా, లేదా అన్న అంశానికే పరిమితం కావాల్సిన సుప్రీం కోర్టు బెంచీ ఆమెకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయో, లేవో తేల్చాల్సిందిగా 136  అధికరణం కింద సంక్రమించిన అధికారాల మేరకు ఎన్‌ఐఏను ఆదేశించడం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడే ఉన్న సీనియర్‌ న్యాయవాది ఫాలి ఎస్‌ నారిమన్‌ను పిలిచి ప్రశ్నించారు.

ఓ కేసులో సంపూర్ణ న్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు 136 అధికరణం కింద కాకుండా 142 అధికరణం కింద ఇలాంటి అదేశాలను సుప్రీం కోర్టు జారీ చేయవచ్చని నారిమన్‌ వివరించారు. పైగా పెళ్లిని రద్దు చేసినప్పటి నుంచి తండ్రి ఇంట్లో కూతురును నిర్బంధించి ఉంచడం, అందులో పోలీసుల కాపలా పెట్టడం ఏమిటని కూడా మిశ్రా ప్రశ్నించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. హోమియోపతి డిగ్రీ చదివిన అఖిల 2016 మొదట్లోనే ఇస్లాం కోర్సు పాసై మతం మార్చుకున్నారు. అదే సంవత్సరం మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా సంబంధాలు వెతక్కొని 2016, డిసెంబర్‌ నెలలో ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

ముస్లిం సంఘాల ప్రోద్బలంతో అఖిల పెళ్లి చేసుకున్నారంటూ, ఇది లవ్‌ జీహాదీయేనంటూ ఆమె తండ్రి అశోక్‌ హైకోర్టును ఆశ్రయించడంతో 2017, మే 24వ తేదీన కేరళ హైకోర్టు ఆమె పెళ్లిని రద్దు చేసింది. ఆమెను తండ్రి సంరక్షణలో ఉండాల్సిందిగా ఆదేశించింది. కేరళలోని కొట్టాయం జిల్లా, టీవీ పురంలోని తన తండ్రి ఇంట్లో అఖిల నిర్బంధంగా ఉంటున్నారు. ఆమె భర్త షఫీన్‌ జహాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement