హ్యారిసన్- షహానా (ఫేస్‌బుక్ ఫొటో)
తిరువనంతపురం : ‘మమ్మల్ని చంపితే మీకేం వస్తుందం’టూ ఓ నవ వధువు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. కేరళకు చెందిన హ్యారిసన్ (క్రిస్టియన్), షహానా (ముస్లిం)లు రెండు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకున్నారు. వివాహానంతరం భార్యతో కలిసి దిగిన ఫొటోను హ్యారిసన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కాసేపటి తర్వాత.. మతాంతర వివాహం చేసుకున్న కారణంగా తమను చంపుతామంటూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ హ్యారిసన్ వీడియోను పోస్ట్ చేశాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
నేను కెవిన్‌లా చనిపోవాలనుకోవడం లేదు..
పరువు హత్యల గురించి మాట్లాడుతూ... ‘మేము రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి మాకు బెదిరింపులు మొదలయ్యాయి. ఓ తీవ్రవాద భావాలు గల సంస్థ(ఎస్‌డీపీఐ) చంపేస్తామని బెదరిస్తోంది. నాతో పాటు మా అమ్మానాన్నల్ని కూడా చంపేస్తారట. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా కెవిన్(ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన వ్యక్తి)లా జీవితాన్ని కోల్పోలేనంటూ’ హ్యారిసన్ పేర్కొన్నాడు.
కుల, మతాలకు అతీతంగా..
షహానా మాట్లాడుతూ.. ‘ప్రేమ, పెళ్లి అనేది మనసుకు సంబంధించినవి. మేము మా కులం, మతం గురించి ఆలోచించలేదు. కానీ నా కుటుంబ సభ్యులే ఇప్పుడు నన్ను, నా భర్త కుటుంబాన్ని చంపేస్తామంటున్నారు. కానీ జీవితాంతం అతడితో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మమ్మల్ని చంపితే మీకేం వస్తుందంటూ’ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ వీడియో గురించి గానీ, ఆ జంట గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment