సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, స్వాతంత్రోద్యమం తరహాలో దేశంలో సీఏఏ వ్యతిరేకోద్యమం జరుగుతోందని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం వీరు మాట్లాడారు. కేశవరావు మాట్లాడుతూ.. ‘అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్ గురించి మా వైఖరిని మా సీఎం ఇప్పటికే వెల్లడించారు.
రాష్ట్రం తరఫున సీఏఏను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేయాలనుకున్నాం. కేంద్ర చట్టం కాబట్టి ఎలా తీర్మానం చేస్తారని కొందరు అంటున్నారు. రాష్ట్రానికి ఆ హక్కు ఉంది. అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే చెప్పాం. పార్లమెంటు తెచ్చిన ఈ బిల్లును కోట్లాది మంది ప్రజలతోపాటు రాష్ట్రాలు కూడా చట్టసభల ద్వారా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని పలువురు ఇతర రాష్ట్రాల మంత్రులు ప్రశంసించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో సీఏఏ, దేశ ఆర్థిక స్థితిగతులు, ఏపీ పునర్ వ్యవస్థీకరణ అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలి’అని పేర్కొన్నారు.
సీఏఏను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి..
టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘సీఏఏ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే మా నేత కేసీఆర్ నన్నూ, కేశవరావును పిలిచి సమగ్రంగా చర్చించారు. స్పష్టమైన మార్గదర్శనం చేశారు. దానికి అనుగుణంగానే మేం ఈ బిల్లును వ్యతిరేకించాం. దేశంలో ప్రజలు, రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయంటే దీనిని పున: సమీక్షించుకోవాలి. స్వాత్రంత్య్రోద్యమం తరహాలో ఇప్పుడు సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment