అప్పుడు తలదించుకుని కూర్చుంటా: గడ్కరీ
పుణే: మంత్రుల వద్ద పనిచేసే కొంతమంది వ్యక్తిగత సహాయకుల అత్యుత్సాహంతో ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టీ కంటే దాన్ని మరిగించిన పాత్రే వేడిగా ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో గడ్కరీ ప్రసంగిస్తూ వ్యక్తిగత సహాయకుల కారణంగా తాను కూడా ఇబ్బంది పడిన ఘటనలను గురించి చెప్పుకొచ్చారు.
'ఇటీవల రైల్లో నాగ్‌పుర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్ మేనేజర్‌కు తన పీఏ ఫోన్ చేసి, రైలును మొదటి ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురావాలంటూ నాకు తెలియకుండానే కోరాడు. నా కాలికి గాయం అయిందని చెప్పాడ'ని గడ్కరీ పేర్కొన్నారు. మంత్రులు ఎప్పుడైనా మాజీలు కావచ్చనీ, వారికోసం పోలీసులు అత్యుత్సాహంతో ట్రాఫిక్ ను ఆపడం ఇబ్బందికరమన్నారు.
'ఇలాంటి సందర్భాల్లో కారులో తలదించుకుని కూర్చుంటాను. ప్రజల తిట్లు, ఛీత్కారాలు తప్పించుకునేందుకు ఈవిధంగా చేస్తాన'ని వెల్లడించారు. స్వలాభం చూసుకోకుండా ప్రజల కోసం పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన ఉద్బోధించారు.