సిక్కులు చేయకూడని పని చేశాడు.. అయినా!
సిక్కులు చేయకూడని పని చేశాడు.. అయినా!
Published Tue, Nov 29 2016 9:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
నభా జైలు నుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ.. 24 గంటలలోపే పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తనను గుర్తుపట్టకూడదని ప్రపంచంలో ఏ సిక్కూ చేయని పని చేశాడు. మీసాన్ని పూర్తిగా తొలగించుకుని, గెడ్డం కూడా బాగా పొట్టిగా కత్తిరించేసుకున్నాడు. సాధారణంగా సిక్కులు తమ జుట్టును, మీసాలను, గెడ్డాన్ని కత్తిరించుకోరు. కానీ మింటూ మాత్రం.. తనను చూస్తే ఎవరైనా ముస్లిం అనుకోవాలి తప్ప సిక్కుగా గుర్తుపట్టకూడదని భావించాడు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి ముంబై పారిపోదామని అనుకుంటుండగా.. పోలీసులకు చిక్కాడు. అంతకుముందు తాను 18 సంవత్సరాల పాటు ఉన్న గోవాకు వెళ్లిపోవాలన్నది మింటూ ప్లాన్ అని పోలీసులు చెప్పారు. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ అయిన మింటూపై పది ఉగ్రవాద కేసులు ఉన్నాయి. ఇంతకుముందు డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై బాంబుదాడి కేసులో కూడా మింటూ ప్రధాన నిందితుడు. 2014లో థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు పోలీసులు అరెస్టుచేశారు.
ఆదివారం ఉదయం పోలీసు దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు నభా జైలులోకి ప్రవేశించి, గాల్లోకి వందరౌండ్ల కాల్పులు జరిపి మింటూ సహా ఐదుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను తీసుకుని పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మింటూను 90 కిలోమీటర్ల దూరంలో హరియాణా వద్ద దింపారు. అక్కడ అతడు బస్సు ఎక్కి ఢిల్లీ వెళ్లాడు. ముందుగా జైల్లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడైన పర్వీందర్ సింగ్ పిండా ఉత్తరప్రదేశ్‌లో భారీ ఆయుధాలతో పట్టుబడ్డాడు. వాస్తవానికి తాము మింటూను, కశ్మీర్ సింగ్‌ను తీసుకెళ్లడానికి రాలేదని, పలు హత్యకేసులు, హైవే దోపిడీ కేసుల్లో నిందితుడైన విక్కీ గౌండర్‌ను తప్పించడానికి వచ్చామని అతడు చెప్పాడు. అందివచ్చిన అవకాశాన్ని మింటూ కూడా వాడుకున్నాడు.
Advertisement
Advertisement